ఒక ఉద్యోగి, హెచ్ఆర్ (HR) మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద చర్చగా మారింది. విషయం ఏంటంటే యు.ఎస్. (US) కంపెనీలో పనిచేసే భారతీయ ఉద్యోగి ఒకరు షిఫ్ట్ టైం అయిపోవడానికి నాలుగు నిమిషాలు ముందు లాగ్ అవుట్ అయినందుకు హెచ్ఆర్ లెక్చర్ ఇచ్చింది. అంతేకాదు పని పూర్తయినా కూడా అందరూ ఉదయం 6:30 గంటలకే లాగ్ అవుట్ కావాలని హెచ్చరించడం ఉద్యోగులకు కోపం తెప్పించింది.
కంపెనీ ఉద్యోగి రాత్రి 9:18 గంటలకు లాగిన్ అయ్యానని, పని అంతా అయిపోయిందని చెప్పినా హెచ్ఆర్ అంగీకరించలేదు. కంపెనీ లాగిన్-లాగ్ అవుట్ టైంలను ట్రాక్ చేయడానికి ప్రత్యేక యాప్‌ను ఉన్న కూడా, ఇప్పుడు హెచ్ఆర్ లాగిన్-లాగ్ అవుట్ టైంలను వాట్సాప్‌లో కూడా మెసేజ్ పెట్టాలని డిమాండ్ చేయడంపై ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు హెచ్ఆర్ తీరుపై రకరకాలుగా విమర్శిస్తున్నారు.
రెడ్డిట్‌లో (Reddit) షేర్ చేసిన వాట్సాప్ స్క్రీన్‌షాట్ ప్రకారం, హెచ్ఆర్ 6:30కి ముందే ఎందుకు లాగ్ ఔట్ అయ్యావు అని అడగ్గా... ఉద్యోగి జస్ట్ 4 నిమిషాలే కదా.. నా పని కూడా పూర్తి అయ్యింది. పైగా, నేను రాత్రి 9:18 గంటలకే లాగిన్ అయ్యాను అని రిప్లయ్ ఇస్తుంది. దీనికి హెచ్ఆర్ తీవ్రంగా స్పందిస్తూ మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేయలేరు. మీ పని పూర్తి చేసినా కూడా, మీ షిఫ్ట్ 6:30 గంటలకు అయిపోతుంది. అందరూ 6:30 గంటలకే లాగ్ అవుట్ అవుతారు. ముందుగా లాగిన్ అవ్వడం కరెక్ట్ కాదు. 9:00 గంటలకు లాగిన్ అయ్యి 6:30 గంటలకు లాగ్ అవుట్ అయ్యేవాళ్లు కూడా ఉన్నారు. మీ షిఫ్ట్ టైం ఫాలో అవ్వండి అని రిప్లయ్ చేసింది.
సోషల్ మీడియాలో విమర్శలు: ఉద్యోగి చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ యూజర్లు రకరకాల కామెంట్స్ చేసారు. ఒకతను మీ హెచ్ఆర్ చెప్పినట్లుగా చేయండి. షిఫ్ట్ ప్రకారం లాగిన్, లాగ్ అవుట్ అవ్వండి. షిఫ్ట్ అయ్యాక అస్సలు ఫోన్ తీయకండి, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకండి. వాళ్ళు కారణం అడిగితే ఈ చాట్ చూపించండి అని అనగా... మరొకరు చాలా యూరోపియన్ దేశాలలో ఇది మామూలే. ఒక నిమిషం ఎక్కువగా పనిచేసినా దాన్ని ఓవర్ టైం (Overtime)గా చూసి అదనపు డబ్బులు చెల్లించాలి అంటారు.
వేరే అతను HR మాట్లాడిన పద్ధతి బాగాలేదు. నా కంపెనీ ఇలా చేసి ఉంటే నేను ఎప్పుడో ఇబ్బందుల్లో పడేవాడిని. రాజీనామా చేసేయండి అని కామెంట్ చేయగా.... ఇంకొకరు కన్సల్టింగ్ కంపెనీల విషయంలో లాగిన్-లాగ్ అవుట్ టైమ్స్ ముఖ్యమే. ఎందుకంటే గంటల ఆధారంగానే క్లయింట్ల నుంచి డబ్బు వసూలు చేస్తారు. అందుకే, ముందుగా లాగ్ అవుట్ అయితే ఆడిట్లలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మరో వ్యక్తి ఇవి చిన్న చిన్న ఇబ్బందులే. ఇలాంటి మేనేజర్లు/వ్యక్తులు ప్రతి ఐటి కంపెనీలో ఉంటారు అని అన్నారు.
