కేసీఆర్​ బొమ్మ ఔట్​డేటెడ్‌: ఈటల

కేసీఆర్​ బొమ్మ ఔట్​డేటెడ్‌: ఈటల
  • హుజూరాబాద్​ ఎన్నిక తర్వాత టీఆర్​ఎస్​ కథ కంచికే
  • నన్ను ఓడించేందుకు సీఎం 2 వేల మంది నేతలను దింపిండు
  • కేంద్రం నిధులతో రాష్ట్రం సోకులు: వివేక్​

జమ్మికుంట/వీణవంక, వెలుగు: సీఎం కేసీఆర్ ​బొమ్మకు ఓట్లు పడే రోజులు పోయినయని, ఆ బొమ్మ ఔట్​డేట్​అయిందని హుజూరాబాద్​ బీజేపీ క్యాండిడేట్​ ఈటల రాజేందర్​ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్​ ఎన్నిక తర్వాత టీఆర్ఎస్​ కథ క్రమంగా కంచికి చేరుతుందని, 2023లో అధికారం కోల్పోవడం ఖాయమని చెప్పారు. తన రాజీనామా తర్వాత  గొల్ల కురుమలకు గొర్లు, దళితులకు దళితబంధు వచ్చాయని.. అది ప్రజల మీద ప్రేమ కాదని, ఓట్ల మీదని చురకలంటించారు. వీణవంక మండలంలోని గంగారం, ఎల్బాక, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు గ్రామాల్లో మాజీ ఎంపీలు వివేక్​ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్​రావు, ఏనుగు రవీందర్​రెడ్డితో కలిసి ఈటల సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈటల మాట్లాడుతూ..  నిలదీసేవాడు అసెంబ్లీలో అడుగుపెడితే ఎక్కడ తన కుటుంబపాలన అంతరించిపోతుందోనని తనను ఓడించేందుకు 2 వేల మంది నాయకులను, వెయ్యికి పైగా కొత్త లగ్జరీ కార్లను నియోజకవర్గంలో చక్కర్లు కొట్టిస్తున్నారని సీఎం కేసీఆర్​పై మండిపడ్డారు.  నియోజకవర్గంలో పోలీస్ ​రాజ్యం నడుస్తోందని, ప్రగతిభవన్​ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. 
ప్రజలు నా వెంటే ఉన్నరు
రూలింగ్​పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేస్తున్నా ప్రజలు ఆత్మాభిమానంతో తనకు మద్దతు తెలుపుతున్నారని ఈటల చెప్పారు. దీంతో దిక్కుతోచని టీఆర్​ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు కుడితిలో పడ్డ ఎలుకల్లా గింజుకుంటున్నారన్నారు. ఊసరవెల్లుల్లాంటి కొందరు నేతలు వెళ్లిపోయినా ప్రజలు మాత్రం తన వెంటే ఉన్నారని చెప్పారు. తనను ఓడించేందుకు కేసీఆర్​ రకరకాల కుట్రలు పన్నుతున్నారని, రాజేందర్​ గుర్తు కారు గుర్తు అని చెబుతున్నారని, ప్రజలు అలర్ట్​గా ఉండాలని సూచించారు. ‘పెద్దపల్లి ఎమ్మెల్యేకు ఆనాడు టికెట్​ నేనే ఇప్పించిన. ఆయన గెలవాడానికి నేనే ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన ఇక్కడికొచ్చి ప్రచారం చేస్తండు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసేందుకు బయలుదేరిండు. రానున్న రోజుల్లో పెద్దపల్లికి వస్తా ఖబడ్దార్.. కాస్కో’ అని ఈటల రాజేందర్ అన్నారు.  
హంతకుడిని డీఎస్పీగా వేసిన్రు: రఘునందన్​ రావు
‘హుజూరాబాద్​ డీఎస్పీ వెంకట్​రెడ్డి.. ముదిగొండలో 90 గజాల జాగా అడిగితే 9 మందిని కాల్చి చంపిండు. 9 మందిని హత్య చేసిన వ్యక్తి ఇక్కడ ఎన్నికలెలా నిర్వహిస్తడు? క్షణికావేశంలో ఏదైనా చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?’ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు మండిపడ్డారు. ‘పెట్రోల్​ ధరలు పెరిగడంలో రాష్ట్ర సర్కారు వాటా లేదా? తమిళనాడులో స్టాలిన్​ రూ. 3 తగ్గించారు. నువ్వు రూ. 30 తగ్గించవచ్చుగా’ అని హరీశ్​రావును ప్రశ్నించారు. ‘కొండగట్టులో,  మాసాయిపేటలో బస్సు ప్రమాదాలైతే పరామర్శించడు. ఇది మన కేసీఆర్​ సార్​ మనస్సు. టీఆర్​ఎస్​ ధుంధాం కార్యాక్రమానికి వెళ్లిన 22 ఏండ్ల బీ ఫార్మసీ స్టూడెంట్​ నోటిఫికేషన్​ వేయాలని కోరితే  పోలీసులతో కొట్టించి, బూతులు తిట్టించారు. సార్​ను పొగడాలె. లేదంటే బయటకు పంపుడే’ అన్నారు. అల్లుడు హరీశ్​రావు ఇక్కడ కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నరని, అక్కడ కొడుకు కేటీఆరేమో హుజూరాబాద్​ చిన్న ఎన్నిక అంటున్నారని ఎద్దేవా చేశారు.
కిలో బియ్యానికి కేంద్రం రూ.29 ఇస్తోంది: వివేక్​ వెంకటస్వామి
కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తోందని, కిలో బియ్యానికి రూ.29 కేంద్రం ఇస్తుంటే తామే ఇస్తున్నట్లు రాష్ట్ర సర్కారు చెప్పుకుంటోందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. ఆయుష్మాన్​ భారత్ ​కింద ఒక్కో పేషెంట్​కు కేంద్రం రూ.5 లక్షల దాకా ఇస్తోందని, కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున అందిస్తున్నా కేసీఆర్​సర్కారు రాష్ట్రంలో అమలు చేయట్లేదని చెప్పారు. ఫసల్​భీమా యోజనను వినియోగించుకోక పోవడంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం రావట్లేదని అన్నారు.