వీడు మామూలోడు కాదుగా... డాక్టర్ ను హత్య చేసిన క్రిమినల్

వీడు మామూలోడు కాదుగా... డాక్టర్ ను హత్య చేసిన క్రిమినల్

వైద్యో నారాయణో హరి అంటారు. అలాంటి వైద్య వృత్తిని నిర్వహిస్తున్న ఓ మహిళ డాక్టర్‌ను ఆమె వద్ద చికిత్స పొందుతున్న వ్యక్తే అతి దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటన కేరళలోని కొల్లంలోని కొట్టారకర తాలూకా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాధిత మహిళా డాక్టర్‌ను 23 ఏళ్ల వందన దాస్‌గా గుర్తించారు.ఈ దాడిలో వందనాదాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ట్రీట్‌మెంట్‌ కోసం త్రివేండ్రం తరలించగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఉన్మాది సందీప్‌ దాడిలో మరో నలుగురికి గాయాలయ్యాయి.

 వివరాల్లోకివెళ్తే...

కొట్టాయంకు చెందిన వందన దాస్.. కొట్టారకర తాలూకా ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నారు.మద్యం మత్తులో కుటుంబసభ్యులతో గొడవ పడ్డ సందీప్‌ అనే టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తీసుకొచ్చారు.సందీప్ కు కాలికి గాయం కావడంతో వందనాదాస్‌ అనే డాక్టర్‌ అతడికి ట్రీట్‌మెంట్‌ చేశారు.అక్కడ సందీప్ కాలుకు గాయానికి వందన డ్రెస్సింగ్ చేయడం మొదలుపెట్టారు.అయితే సందీప్ ఒక్కసారిగా డాక్టర్ వందనపై దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్సకు ఉపయోగించే పరికరాలతో విరుచుకుపడ్డాడు. కత్తెర‌, ఇతర పరికరాలతో వందనపై ఐదుసార్లు పొడిచాడు. ఆసుపత్రిలో ఉన్న వారిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వందనను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో పరిస్థితి విషమించడంతో వందన కన్నుమూసింది. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం నిందితుడు సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్టుగా చెబుతున్నారు. 

కేరళలో ఆందోళనలు

వందనాదాస్‌ హత్యకు నిరసనగా కేరళలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలునిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని.. హౌస్ సర్జన్‌లు కూడా స్ట్రైక్‌లో పాల్గొంటారని తెలిపింది.కొట్టారకర తాలూకా ఆసుపత్రిలో మొత్తం సేవలను నిలిపివేశారు. వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించారు.  వైద్యవిద్యార్ధులు క్లాస్‌లను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

హైకోర్టులో పిటిషన్ 

ఈ ఘటన నేపథ్యంలో వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటర్న్‌లు, హౌస్ సర్జన్లకు భద్రత కల్పించాలి. ఆరోగ్య కార్యకర్తలకు కల్పిస్తున్న భద్రతను ఆసుపత్రిలో పనిచేస్తున్న విద్యార్థులకు కూడా కల్పించాలని వినతిపత్రంలో కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన హ్యూమన్ రైట్స్ కమిష న్.  వారం రోజుల్లో నివేదిక అందించాలని జిల్లా అధికారులను  ఆదేశించింది. ఈరోజు  ( మే10) తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ కేసుకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది.

డాక్టర్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.  ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంని వ్యక్తం చేశారు.  విధి నిర్వహణలో డాక్టర్లపై  దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు.  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో వందనాదాస్‌ మృతదేహానికి గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ , సీఎం విజయన్‌ నివాళి అర్పించారు.