ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలి : ముజమ్మిల్​ ఖాన్​

ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలి : ముజమ్మిల్​ ఖాన్​
  • ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్​ ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు : విపత్తులతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. సీపీ సునీల్ దత్ తో కలిసి, విపత్తు నిర్వహణపై రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో విపత్తులను ఎదుర్కోనేలా పక్కా ప్లాన్​తో ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని, అధికారులు హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటేలా చూడాలని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో 1,077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. సీపీ మాట్లాడుతూ గత అనుభవం దృష్ట్యా ఏం జరిగింది, ఏం చేశాం, ఏం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లాలని  చెప్పారు. 

ప్రతీ శాఖ నుంచి విపత్తు నిర్వహణకు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూడీఆర్ఎఫ్ టీమ్​లను డివిజన్ల వారీగా విభజించి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. నాలా, డ్రెయిన్ల క్లియర్ కు చర్యలు చేపట్టామన్నారు. 

అడిషనల్ ​కలెక్టర్ డాక్టర్​ పి. శ్రీజ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న అంగన్​వాడీ, ప్రభుత్వ భవనాలను గుర్తించి, ముందస్తుగా ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లు, విలువైన సామగ్రి, రికార్డులు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నీటి వనరుల తనిఖీలు చేపట్టి, వాటి కాల్వలు, కట్టల పటిష్టతను చూడాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

డ్రైనేజీ నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలి

ఖమ్మం కార్పొరేషన్ : భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఖమ్మం మురుగు నీటి పైప్ లైన్ భూగర్భ డ్రైనేజ్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో రూ.249.5 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ పనులను అమృత్ 2 పథకం కింద మంజూరు కాగా, వీటిలో రూ.189 కోట్ల 50 లక్షల భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం, రూ.60 కోట్లు రాబోయే 10 సంవత్సరాలకు వాటి నిర్వహణకు కేటాయించినట్లు తెలిపారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంలో డ్రైనేజ్ లైన్ 8.5 కిలోమీటర్లకు గాను 1.54 కిలోమీటర్లు, 432 మ్యాన్ హోల్స్ నిర్మాణానికి గాను 73 మ్యాన్ హోల్స్ నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు.

 ధంసలాపురం చెరువు వద్ద 44 ఎంఎల్డీ సామర్థ్యంతో, పుట్టకోట చెరువు వద్ద 9.5 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. మురుగు నీటి కాల్వల 2.5 కిలో మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాల తొలగింపు లేకుండా పూర్తి చేయవచ్చని, 1.5 కిలో మీటర్ వరకు ప్రస్తుతం పూర్తయిందని, పెండింగ్ కిలో మీటర్  నిర్మాణం అదనపు బృందాలు ఏర్పాటుచేసి పూర్తి చేయాలన్నారు. టౌన్ ప్లానింగ్, నీటి పారుదల శాఖ అధికారులు పర్యటించి అవసరమైన పరీక్షలు పూర్తి చేసి, మురుగు నీటి కాల్వల నిర్మాణం అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాల తొలగించాలని సూచించారు. పనులలో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డీఈ, ఏఈలు 
తదితరులు పాల్గొన్నారు.