సిద్దిపేట టీ హబ్ లో టెస్టింగ్ కిట్ల కొరత .. నెల రోజులుగా నిలిచిన కిడ్ని, లివర్ టెస్టులు

సిద్దిపేట టీ హబ్ లో  టెస్టింగ్ కిట్ల కొరత .. నెల రోజులుగా నిలిచిన కిడ్ని, లివర్ టెస్టులు
  • ప్రైవేటు ల్యాబ్ లకు వెళ్తున్న రోగులు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట టీహబ్‌‌‌‌లో కిట్ల కొరతతో నెల రోజులుగా కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ టెస్టులు నిలిచిపోయాయి. టెస్ట్ ల నిర్వహణకు సంబంధించి కిట్స్‌‌‌‌తో పాటు కెమికల్స్ సరఫరా లేకపోవడంతో  నెల రోజులుగా  కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్‌‌‌‌తో పాటు షుగర్ టెస్టులను నిలిపివేశారు. సిద్దిపేట జిల్లాలోని 53 సెంటర్లలో వివిధ ఆరోగ్య పరీక్షల కోసం సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌‌‌‌ను  ప్రతిరోజు టీహబ్‌‌‌‌కు  పంపించి టెస్ట్ లను నిర్వహిస్తుంటారు.  రోజూ ఐదు వాహనాలు జిల్లాలోని అన్ని సెంటర్ల నుంచి దాదాపు రెండువేల శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం సిద్దిపేట టీ హబ్‌‌‌‌కు తెస్తుంటారు. సిద్దిపేట టీహబ్ లో మొత్తం136  రకాల రక్త పరీక్షలను నిర్వహిస్తుండగా ప్రస్తుతం122  రకాల పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. కిట్ల కొరత కారణంగా నెల రోజులుగా కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్  టెస్టులకు సంబంధించిన రక్త నమూనాలను తీసుకోవడం మానేశారు. 

ప్రైవేటు ల్యాబ్‌‌ ల్లో పరీక్షలు

 సిద్దిపేట టీ హబ్ లో కిట్లు అందుబాటులో లేకపోవడంతో కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్  టెస్ట్ ల కోసం రోగులు ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌‌‌‌సీ, సీహెచ్‌‌‌‌సీతో పాటు జిల్లా ఆసుపత్రుల్లో వీటికి సంబంధించిన రక్త నమూనాలను సేకరించడమే నిలిపివేశారు. దీంతో ఈ పరీక్షలు అవసరమైన వారు ప్రైవేటు ల్యాబ్‌‌‌‌లకు వెళ్లడంతో అదనపు ఆర్థిక భారం
 పడుతోంది.

బకాయిలు చెల్లించక నిలిచిన కిట్ల సరఫరా

పలు పరీక్షలకు సంబంధించి కెమికల్స్ సరఫరా చేసే సంస్థకు బకాయిలు చెల్లించకపోవడంతో కిట్ల సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. జిల్లాలోని పలు పీహెచ్‌‌‌‌సీ, సీహెచ్‌‌‌‌సీల్లో  షుగర్ పరీక్షల కోసం రక్త నమూనాలను నిలిపివేయగా  రెండు రోజుల క్రితమే కిట్స్ అందుబాటులోకి రావడంతో  షుగర్ టెస్ట్ లను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కొలస్ట్రాల్, లిపిడ్ ఫ్రొఫైల్‌‌‌‌ టెస్ట్ లను 
నిర్వహిస్తున్నారు. 

కిట్స్ కొరతతో టెస్ట్ లు నిర్వహించడం లేదు

కిట్స్ కొరత వల్ల నెల రోజులుగా టీ హబ్ లో కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్  టెస్టులను నిర్వహించడం లేదు. షుగర్ టెస్ట్ కు సంబంధించి కెమికల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కొద్ది రోజులు నిలిపి వేశాం. తిరిగి షుగర్ టెస్టు కిట్స్ రావడంతో రెండు రోజుల కిందటే ప్రారంభించాం.  వచ్చే ఒకటి రెండు రోజుల్లో కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ల్ లకు సంబంధించిన కిట్లు సరఫరా అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ భార్గవి,  సిద్దిపేట టీ హబ్ ఇన్ చార్జి