V6 News

అంతా మీ పిల్లి వల్లే.. బెంగళూరులో వింత గొడవ.. పొట్టుపొట్టు తిట్టుకున్న ఇంటి ఓనర్లు..

అంతా మీ పిల్లి వల్లే.. బెంగళూరులో వింత గొడవ.. పొట్టుపొట్టు తిట్టుకున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరులో పిల్లి పిల్లల పెంపకం విషయంలో ఎదురింటి వాళ్ళతో జరిగిన వింత గొడవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవను సర్దిద్దడానికి ఏకంగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఉండే ఇద్దరు ఇరుగుపొరుగు  మధ్య ఈ గొడవ మొదలైంది. ఒకరి ఇంట్లో మగ పిల్లి, మరొకరి ఇంట్లో ఆడ పిల్లి ఉండేది....

 పొరుగింటి వారి మగ పిల్లి వల్ల మా ఆడ పిల్లి గర్భవతి అయిందని, నాలుగు పిల్లి పిల్లలు పుట్టాయని ఆడ పిల్లి ఓనర్  గొడవకు దిగారు. ఆ పిల్లి పిల్లల తండ్రి మీ పిల్లే కాబట్టి, వాటి సంరక్షణ బాధ్యత మొత్తం మీరే తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత ఆదివారం ఉదయం ఆడ పిల్లి యజమాని ఆ నాలుగు పిల్లి పిల్లలను తీసుకొచ్చి పొరుగింటి వారి ఇంటి గుమ్మం ముందు పడేశారు. దింతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది.

ఈ గొడవ పెద్దదై ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఆడ పిల్లి యజమాని పొరుగింటి ఓనర్  బిడ్డపై యాసిడ్ దాడి చేస్తానని బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో మగ పిల్లి యజమాని 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులను పిలిపించారు.

►ALSO READ | పెట్రోల్ రూ.18, డీజిల్ రూ.35 నష్టంతో అమ్ముతున్నారా..? ఎన్నికల తర్వాత ఇంత పెంచుతారా ఏంటీ..?

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు కుటుంబాలకు  కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి చిన్న విషయాలకు గొడవలు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. చివరికి, ఒక్కో కుటుంబం రెండు  పిల్లి పిల్లలను పెంచుకోవాలని తీర్పు చెప్పి గొడవను సద్దుమణిగించారు.

ఈ వివాదం నేపథ్యంలో జంతు సంక్షేమ బోర్డు (AWBI), వెటర్నరీ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పెంపుడు పిల్లులకు సకాలంలో సంతాన నిరోధక శస్త్రచికిత్సలు అంటే స్పెయింగ్ లేదా న్యూటరింగ్ చేయించడం చాలా ముఖ్యం. దీనివల్ల పిల్లుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, అనుకోకుండా పిల్లి పిల్లలు పుట్టడం వల్ల కలిగే ఇబ్బందులను, ఇలాంటి గొడవలను నివారించవచ్చు.

వీధి పిల్లుల జనాభా పెరగకుండా ఉండటానికి ప్రభుత్వం కూడా ఈ శస్త్రచికిత్సలను ప్రోత్సహిస్తోంది. పెంపుడు జంతువుల పట్ల బాధ్యతగా ఉంటే ఇలాంటి వింత గొడవలు జరగవని పోలీసులు సూచిస్తున్నారు.