Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఆరంభానికి సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న పోరుతో ఆర్‌సీబీ తమ రెండో టైటిల్ వేటను ప్రారంభించనుంది. అయితే, ఈసారి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నెట్స్ లో జోరుగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే సీజన్ లో బౌలింగ్ లోనూ సత్తా చాటాలని విరాట్ కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు.
సంప్రదాయాన్ని మార్చిన బీసీసీఐ:
సాధారణంగా గత సీజన్ లో ఫైనలిస్టుల మధ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్ జరుగుతుంది. కానీ ఈసారి బీసీసీఐ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది, ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మొదటి దశ మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనుంది.
కోహ్లీ–-సాల్ట్ జోడిపై అంచనాలు:
గత సీజన్‌లో విరాట్ కోహ్లీ– ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ జోడి అద్భుతమైన ప్రదర్శన చేసింది. 13 ఇన్నింగ్స్‌లలో వీళ్లిద్దరూ ఏకంగా 565 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా కేకేఆర్‌పై 175 రన్స్ ఛేదనలో వీరిద్దరూ కేవలం 9 ఓవర్లలోనే 95 పరుగులు చేయడం విశేషం. ఇటీవల నెట్స్‌లో కోహ్లీ, ఫిల్ సాల్ట్‌కు బౌలింగ్ చేస్తూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫిల్ సాల్ట్ ఫామ్‌పై నో టెన్షన్:
ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు (8 మ్యాచ్‌ల్లో 130 రన్స్). కానీ ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బొబాట్ మాత్రం దీనిపై మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో సాల్ట్ ఒకడు, అతని ఫామ్‌పై మాకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
11వ నంబర్ జెర్సీతో బరిలోకి:
గతేడాది ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన సమయంలో చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల జ్ఞాపకార్థం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లేయర్స్ అందరూ 11వ నంబర్ జెర్సీ ధరించి ఆడనున్నట్లు ఫ్రాంచైజీ పేర్కొనింది. అలాగే స్టేడియం ప్రవేశ ద్వారం దగ్గర ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ 11 మంది గుర్తుగా స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచనున్నట్లు వెల్లడించారు.
ఎస్ఆర్‌హెచ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ స్పెషల్ రోల్ లో కనిపించే అవకాశం ఉంది. 2026 మార్చి 24 రోజున ఆర్సీబీ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్స్ లో బ్యాటింగ్ చేస్తున్న ఫిల్ సాల్ట్ కి కింగ్ కోహ్లీ బౌలింగ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో విరాట్ సరికొత్త పాత్రలో కనిపిస్తాడని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.
