- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నిజామాబాద్, వెలుగు: విద్యార్థి దశ నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలని, క్రమశిక్షణ మరువద్దొన్నారు. ఓర్పు, సహనంతో మెలగడమే కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. భగత్ సింగ్, చేగువేరాను స్ఫూర్తిగా తీసుకొని చైతన్యవంతమైన ఆలోచనలు పెంచుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం ఆయన నిజామాబాద్ నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ 4 రాష్ట్ర మహాసభల్లో ప్రారంభోపన్యాసం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తూ పేద పిల్లలకు చదువు అందని పండుగా మారుస్తోందని ఆరోపించారు. దేశమంతటికి నాణ్యమైన ఒకేరకమైన విద్యను అందించాలన్నారు.
ఉన్నత లక్ష్యాలు విధించుకొని సాకారం చేసుకోడానికి కృషి చేయాలని సూచించారు. ఏఐఎస్ఎఫ్ అన్ని స్టూడెంట్ యూనియన్లకు తల్లిలాంటిదని తాను అక్కడి నుంచే ఎదిగానన్నారు. నాయకత్వ లక్షణాలు ఒంటబట్టించుకున్నానన్నారు. యూనియన్ నేషనల్ జనరల్ సెక్రెటరీ దినేష్ శివలింగరాజన్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థ ప్రైవేట్, కార్పొరేట్ మేనేజ్మెంట్ల చేతుల్లోకి వెళ్లిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విద్యారంగం మొత్తాన్ని ప్రైవేటుపరం చేసేలా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. యూజీసీ నిధులు కేటాయింపులు తగ్గాయన్నారు. స్టేట్ ఉర్దు అకాడెమీ ఛైర్మన్ తాహెర్ మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యాకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
జిల్లాలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు ఇంటెగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.800 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్టూడెంట్ లీడర్లు ఇటికెల రామకృష్ణ, గ్యార నరేష్, రహ్మాన్, నాగజ్యోతి, వెంకటేష్, రాజారెడ్డి, రాజేశ్వర్, రాజన్న, విఠల్గౌడ్, దశరథ్ తదితరులు ఉన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే మహాసభల ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
