- బీసీ రిజర్వేషన్లు 42 శాతమనిజెప్పి..
- 17 శాతమే ఇచ్చారు: కేటీఆర్
- స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను
- గెలిపించాలని క్యాడర్‌కు పిలుపు
వరంగల్/జనగామ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‍లో హామీ ఇచ్చి పంచాయతీల్లో 17 శాతం సీట్లు మాత్రమే కేటాయించిందన్నారు. బుధవారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. నవంబర్ 29న దీక్షా దివాస్ నేపథ్యంలో హనుమకొండలోని బీఆర్‍ఎస్ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మీటింగ్‍లో పాల్గొని, మాట్లాడారు.
బీఆర్‍ఎస్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేల్లో బీసీలు 51 శాతం ఉన్నారని తేలితే.. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్వహించిన కులగణన సర్వేలో మాత్రం 46 శాతమే ఉన్నారంటూ తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. బీసీలకు ఆరు నెలల్లో విద్య, ఉద్యోగ, ప్రభుత్వ కాంట్రాక్టులు, రాజకీయ పదవుల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రెండేండ్లు అవుతున్నా చేయలేకపోయారన్నారు.
ఢిల్లీలో రాజ్యాంగ సవరణ, అసెంబ్లీలో బిల్లు, కెబినెట్‌లో ఆర్డినెన్స్, జీవో అంటూ కాయాపన చేసి చివరకు పార్టీలతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం మోసగించడమేనన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‍రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, రెడ్యా నాయక్ పాల్గొన్నారు.
టెక్స్‌టైల్ పార్కు వరంగల్‌కు గిఫ్ట్..
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు వరంగల్‌కు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని, అది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కేటీఆర్ కోరారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. క్యారెక్టర్.. కమిట్మెంట్ అంటూ నీతులు చెప్పే కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. క్యారెక్టర్ అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడం.. గబ్బిలంలా సూరును పట్టుకుని వేలాడడం కాదని విమర్శించారు.
