ఏమయ్యా ఆర్డీఓ.. మజాక్​ అనిపిస్తుందా..

ఏమయ్యా ఆర్డీఓ.. మజాక్​ అనిపిస్తుందా..
  • సిరిసిల్ల ఆర్డీఓ మీద కేటీఆర్​ ఆగ్రహం
  • రంగంపేట రైతులకు పెట్టుబడి సాయం  ఎందుకివ్వలేదని ఫైర్​
  • వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు ఆదేశం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల రెవెన్యూ ఆఫీసర్ల మీద ఫైర్​ అయ్యారు.  సిరిసిల్ల ఆర్డీఓ  శ్రీనివాస్​రావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలంలోని రంగంపేట గిరిజనులకు రైతుబంధు రాకపోవడంపై  అసహనం వ్యక్తం చేశారు. సోమవారం సిరిసిల్లలోని క్యాంపు ఆఫీసులో మంత్రి కేటీఆర్​ను కలిసిన రంగంపేట రైతులు.. మీరు గిరిజనులకు పట్టాలు ఇప్పించినా  రైతు బంధు రావడం లేదని చెప్పారు. దీంతో  ఆర్డీఓ ఎక్కడ.. అంటూ   కేటీఆర్​ మండిపడ్డారు. ఆర్డీఓ శ్రీనివాస్​రావ్​ ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఆయన వినలేదు. ‘ ఏమయ్యా ఆర్డీఓ  ఏం పని చేస్తున్నావ్​.. ప్రభుత్వం పట్టాలిచ్చిన రైతులకు రైతుబంధు రాదా..? ఏం మజాక్​ అనిపిస్తుందా’ అంటూ గరమయ్యారు. కలెక్టర్ ​కృష్ణభాస్కర్​ను పిలిచి.. ‘రంగం పేటలో గిరిజనులకు, ఇతర రైతులకు తానే  పట్టాలిప్పించానని, రైతులు ఇబ్బందులు పడొద్దు, పెట్టుబడి సాయం రావాలని స్వయంగా మీకే చెప్పిన..  అయినా  ఇప్పటి వరకు చేయకపోతే ఎలా? ఆ పనేందో త్వరగా చేయండి’ అని ఆదేశించారు.  త్వరలోనే  సాయం  అకౌంట్లలో పడుతుందని రంగంపేట రైతులకు కేటీఆర్​ హామీ ఇచ్చారు.