బీఆర్ఎస్ ఛలో బస్ భవన్.. కేటీఆర్, హరీష్ రావు హౌస్ అరెస్టు

బీఆర్ఎస్ ఛలో బస్ భవన్..  కేటీఆర్, హరీష్ రావు హౌస్ అరెస్టు

ఆర్టీసీ బస్ చార్జీల పెంపుకు నిరసనగా గురువారం (అక్టోబర్ 09) బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది. దీంతో ఎలాంటి అవాంఛనీయగ ఘటనలు జరగకుండా పోలీసులు మందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను ముందస్తుగా హౌజ్ అరెస్టు చేశారు పోలీసులు. అదే విధంగా హైదరాబాద్ లో ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను హౌస్ అరెస్టు చేశారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన నివాసం ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద  భారీగా పోలీసులు మోహరించారు.  మణికొండ పుప్పాలగూడలోని ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. 

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ -ఎస్ప్రెస్ బస్సులు అన్నింటిలో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. మొదటి మూడు స్టేజీలకు 5 రూపాయలు, 4వ స్టేజీ నుంచి 10 రూపాయలు అదనపు ఛార్జీలు  పెంచింది TGSRTC. అదే విధంగా మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ పెంచారు. అక్టోబర్ 06 నుంచి అమల్లోకి వచ్చాయి.