ఓయూ పీజీ సెంటర్ నుంచి వర్సిటీ స్థాయికి కేయూ.. ఇవాళ (ఆగస్టు 18) గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి ఎంట్రీ

ఓయూ పీజీ సెంటర్ నుంచి వర్సిటీ స్థాయికి కేయూ.. ఇవాళ (ఆగస్టు 18) గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి ఎంట్రీ
  • 1976 ఆగస్టు 19న కాకతీయ వర్సిటీగా ఆవిర్భావం 
  •   వేల మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన వర్సిటీ
  • తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ కీలకపాత్ర
  • ఇవాళ (ఆగస్టు 18) గోల్డెన్ జూబ్లీ ఇయర్ (50 ఏండ్లు)లోకి ఎంట్రీ

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దింది.  మరెందరికో  పోరు పాఠాలు నేర్పింది. విద్యార్థి ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గానూ నిలిచింది. ఉద్యమ చైతన్యం రగిలించి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలకపాత్రను పోషించింది. 

మొదట్లో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్ గా ఏర్పాటై, ఆ తర్వాత వర్సిటీగా అప్ గ్రేడ్ అయింది. 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. నేటికి 50వ ఏండ్లు నిండగా.. మంగళవారం గోల్డెన్ జూబ్లీ ఇయర్ లోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ను కేయూలో నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

పీజీ సెంటర్ నుంచి వర్సిటీగా.. 

1968లో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్ ను వరంగల్ లో ఏర్పాటు చేశారు. అనంతరం యూనిర్సిటీగా అప్ గ్రేడ్ చేశారు. పీజీ సెంటర్ నుంచి ప్రత్యేక వర్సిటీగా ఎదిగింది. రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత రెండో అతిపెద్ద యూనివర్సిటీ కూడా కాకతీయ యూనివర్సిటీ పేరుపొందింది.  కేయూ పరిధిలో  ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం వర్సిటీ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ తో కొనసాగు తుంది. వర్సిటీలో 64 రెగ్యులర్ కోర్సులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా1988లో ఎస్డీఎల్సీఈ(స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్) ప్రారంభించారు. ఇందులో 32 కోర్సులు ఉన్నాయి. ఏటా కేయూ నుంచి 1,500 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ప్లేస్ మెంట్స్ సాధిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

ఇప్పటివరకు 14 మంది వీసీలుగా..

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.కొత్తపల్లి జయశంకర్ సార్ తో పాటు ఇప్పటివరకు 13 మంది కేయూ వీసీలుగా పని చేశారు. ప్రస్తుతం 14వ వీసీగా ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి ఉన్నారు. 1976లో కేయూ ఏర్పడినప్పుడు  ప్రొ.కె.వెంకటరామయ్య వీసీగా  బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రొ.జాఫర్ నిజాం, ప్రొ.టి.వాసుదేవ్, ప్రొ.జాఫర్ నిజాం వీసీలుగా వ్యవహరించారు. 1991 డిసెంబర్ నుంచి 1994 డిసెంబర్ వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీసీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రొ.వై.వైకుంఠం, ప్రొ.విద్యావతి, ప్రొ.చంద్రకాంత్ కొకాటే, ప్రొ.వి.గోపాల్ రెడ్డి, ప్రొ.ఎన్.లింగమూర్తి, ప్రొ.బి.వెంకటరత్నం, ప్రొ.ఆర్.సాయన్న, ప్రొ.తాటికొండ రమేశ్ వీసీలుగా పని చేశారు.

తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర

తెలంగాణ ఉద్యమంలోనూ వర్సిటీ ముఖ్య పాత్ర పోషించింది.  ప్రొ.జయశంకర్ సార్, బియ్యాల జనార్ధన్ రావు వంటి ఎంతో మంది ఉద్యమకారులు  స్వరాష్ట్ర  చైతన్యం రగిలించి ఉద్యమబాట పట్టించారు. 2009 నవంబర్ లో కేయూ విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ మలిదశ పోరాటంలో పాల్గొ న్నారు.  కేయూకు అనుబంధ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీతో పాటు జిల్లా అంతటా శిబిరాలు ఏర్పాటు చేసి స్టూడెంట్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లంతా కలిసి దీక్షలు కొనసాగించారు. వరంగల్ లో నిర్వహించిన పొలికేకతో పాటు ఇతర సభలు, సమావేశాలు, నిరసనల్లో కేయూ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని స్వరాష్ట్ర సాధనోద్యమంలో ముఖ్యపాత్ర పోషించారు.

ఆటుపోట్ల నడుమ.. 

కేయూ ఎన్నో ఆటుపోట్లు కూడా ఎదుర్కొంది. గత ప్రభుత్వం పట్టించుకోక పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతోనే వర్సిటీ అభివృద్ధికి నోచుకోక సమస్యల్లో చిక్కింది. ప్రస్తుతం వర్సిటీలో దాదాపు 81 శాతం ఖాళీలే ఉన్నాయి.  409 పోస్టులకుగానూ 76 మందే పని చేస్తుండగా.. 333 పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు తమను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా పోరాటాలు చేస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా అరకొరగానే ఇస్తుంది.  వర్సిటీలో అభివృద్ధి పెద్దగా కనిపించడం లేదు. వర్సిటీకి చెందిన 673.12 ఎకరాల్లో చాలావరకు కబ్జాకు గురైందనే ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. ఇక కేయూలో 24 వరకు హాస్టళ్లు ఉండగా.. కెపాసిటీకి మించి విద్యార్థులు హాస్టల్ లో ఉంటుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా అర శతాబ్ధమైన వర్సిటీలో సమస్యలు వేధిస్తుండగా.. ఇకనైనా వర్సిటీని అభివృద్ధి బాట పట్టించాలని విద్యార్థులు కోరుతున్నారు. 

అన్నింట్లో వర్సిటీని అభివృద్ధి చేస్తం

కేయూకు 50 ఏండ్లు పడుతుండగా.. వర్సిటీ సమగ్ర అభివృద్ధి ప్లాన్ రెడీ చేశాం. అకడమిక్, రీసెర్చ్, ఇన్ ఫ్రాస్ట్రక్టర్.. ఇలా అన్నింట్లో మార్పులు తీసుకొస్తం. పీజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల సిలబస్ లోనూ మార్పులు చేసి, ఇన్నోవేషన్స్ వైపు అడుగులు వేస్తాం. కేయూను అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలనే ప్లాన్ తో ముందుకు పోతున్నాం. 
‌‌ - కె.ప్రతాప్ రెడ్డి, వీసీ, కేయూ