పైసలున్నా.. పట్టించుకోవట్లే నేషనల్‌‌‌‌ ఫ్యామిలీ బెనిఫిట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు ప్రచారం కరువు

 పైసలున్నా.. పట్టించుకోవట్లే  నేషనల్‌‌‌‌ ఫ్యామిలీ బెనిఫిట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు ప్రచారం కరువు
  • రేషన్‌‌‌‌ కార్డు కలిగి ఉండి కుటుంబ పెద్ద చనిపోతే స్కీమ్‌‌‌‌ కింద రూ. 20 వేల సాయం
  • అవగాహన కల్పించని ఆఫీసర్లు.. అప్లై చేసుకోలేకపోతున్న ప్రజలు
  • వేలాది మందికి అవకాశం ఉన్నా.. వందల్లోనే అప్లికేషన్లు

కరీంనగర్/యాదాద్రి, వెలుగు : రేషన్‌‌‌‌ కార్డు కలిగిన కుటుంబ పెద్ద ఏదైనా కారణంతో చనిపోతే బాధిత ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న నేషనల్‌‌‌‌ ఫ్యామిలీ బెనిఫిట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ (ఎన్ఎఫ్ బీఎస్) కు సరైన స్పందన లభించడం లేదు. లబ్ధిదారులకు ఇచ్చేందుకు సర్కార్‌‌‌‌ ఖజానాలో పైసలు ఉన్నా... రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యం.. ప్రజల్లో అవగాహన లేని కారణంగా స్కీమ్‌‌‌‌కు ఎవరూ అప్లై చేసుకోవడం లేదు.

 ఈ స్కీమ్‌‌‌‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆఫీసర్లు.. అసలు ఇలాంటి ఒక స్కీమ్‌‌‌‌ ఉందన్న విషయాన్నే మర్చిపోయారు. కుటుంబ పెద్దగా ఉన్న నిరుపేదలు ఏటా వేలల్లో చనిపోతున్నా.. అప్లికేషన్లు మాత్రం పదులు, వందల్లోనే వస్తున్నాయి. అంత్యక్రియలు చేసేందుకు కూడా ఇబ్బందులు పడే కూలీలు, అత్యంత నిరుపేదలకు సైతం ఈ సాయం అందడం లేదు. 

ఏటా 7,794 కుటుంబాలకు అవకాశం

ఎన్ఎఫ్ బీఎస్ కింద ఏటా 7,794 కుటుంబాలకు సాయం అందించేందుకు కేంద్రం రూ.15.58 కోట్లు విడుదల చేస్తోంది. కానీ అప్లికేషన్లు వందల సంఖ్యలోనే వస్తుండడంతో నిధులన్నీ ఖజానాలోనే మూలుగుతున్నాయి. ఈ స్కీమ్‌‌‌‌ను రాష్ట్రంలో సరిగ్గా అమలుచేయని కారణంగా సుమారు 30 వేల కుటుంబాలకు ఇచ్చే నిధులు మిగిలిపోయాయి. రైతు బీమా ఇస్తున్నామన్న సాకుతో గత ప్రభుత్వ హయాం నుంచే ఆఫీసర్లు ఈ అప్లికేషన్లు తీసుకోవడం మానేశారు. దీంతో ఎలాంటి బీమాకు నోచుకోని కౌలు రైతులు, కూలీలకు కూడా అన్యాయం జరుగుతోంది. 

ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌బీఎస్‌‌‌‌కు అర్హతలివే...

బీపీఎల్‌‌‌‌ పరిధిలో ఉండి రేషన్‌‌‌‌ కార్డు కలిగిన కుటుంబ పెద్ద చనిపోతే అతడి ఫ్యామిలీ ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌బీఎస్‌‌‌‌కుఅప్లై చేసుకోవాలి. ఇందుకోసం డెత్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌, రేషన్‌‌‌‌ కార్డు, క్యాస్ట్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌తో పాటు కుటుంబ సభ్యుల ఆధార్‌‌‌‌ కార్డులు, ఫ్యామిలీ సర్టిఫికెట్‌‌‌‌, భార్యదిగానీ తల్లిదిగానీ పాస్‌‌‌‌ బుక్‌‌‌‌తో మీ సేవ కేంద్రం లభించే అప్లికేషన్‌‌‌‌ ఫామ్‌‌‌‌ దరఖాస్తు చేసుకోవాలి. ఈ అప్లికేషన్‌‌‌‌ కాపీని తహసీల్దార్ ఆఫీసులో అందించాలి. అదే విధంగా సాధారణ మరణమా ? ప్రమాదామా ? ఆత్మహత్యనా ? అనే విషయానికి సంబంధించి అఫిడవిట్‌‌‌‌ అందించాలి. 

2017 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చనిపోయినా ఈ స్కీమ్‌‌‌‌కు అప్లై చేసుకోవచ్చు. తహసీల్దార్‌‌‌‌ స్థానికంగా ఎంక్వైరీ చేశాక ఆర్డీవో, ఆ తర్వాత డీఆర్‌‌‌‌వో అప్రూవల్‌‌‌‌కు పంపిస్తారు. అనంతరం కలెక్టర్‌‌‌‌ ద్వారా ప్రభుత్వానికి రిపోర్ట్‌‌‌‌ వెళ్తుంది. అంతా సక్రమంగా ఉంటే మృతుడి కుటుంబ సభ్యుల అకౌంట్‌‌‌‌లో రూ. 20 వేలు జమ అవుతాయి. సాధారణంగా పురుషుడే కుటుంబ పెద్దగా ఉంటారు. అతడు మరణిస్తే భార్యకు ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌బీఎస్‌‌‌‌ కింద సాయం అందుతుంది. అయితే ఈ స్కీమ్‌‌‌‌కు అప్లికేషన్లు తక్కువగా వస్తుండడంతో గతంలో స్కీమ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను సవరించారు. భర్త చనిపోయిన తర్వాత కుటుంబ పెద్దగా మహిళ ఉండి.. ఆమె చనిపోయినా పిల్లలకు సాయం అందించనున్నారు.

యాదాద్రి, జనగామ, కరీంనగర్ లోనే మెరుగు

ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌బీ స్కీమ్ కింద ప్రతి ఏటా జిల్లా వారీగా వస్తున్న అప్లికేషన్లు పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే అసలు అప్లికేషన్లే రావడం లేదు. ఇటీవల కలెక్టర్లు, కొందరు ఆఫీసర్ల చొరవ, రైతు స్వరాజ్య వేదిక వలంటీర్ల సాయం కారణంగా కొన్ని జిల్లాల్లో గత మూడు నెలల కాలంలో అప్లికేషన్లు పెరిగాయి. జనవరి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,287 అప్లికేషన్లు రాగా.. ఇందులో 3,273 అప్లికేషన్లకు ఎలిజిబులిటీ ఉన్నట్లు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా వెయ్యికిపైగా అప్లికేషన్లురాగా ఇందులో 626 ఫ్యామిలీలకు ఇప్పటికే ఆర్థిక సాయం అందింది.

 జనగామలో 829, కరీంనగర్ జిల్లాలో 595, హైదరాబాద్‌‌‌‌లో 202, ఆదిలాబాద్‌‌‌‌లో 136, మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరిలో 114 అప్లికేషన్లు రాగా ఇందులో రెండు, మూడు మినహా 99.5 శాతం అప్లికేషన్లు అప్రూవ్‌‌‌‌ అయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్‌‌‌‌ జిల్లాల్లో అసలు అప్లికేషన్లే రాలేదు. జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో కేవలం రెండు చొప్పున అప్లికేషన్లు రాగా.. మిగతా జిల్లాల్లో 20లోపే అప్లికేషన్లు రావడం గమనార్హం. 

అవగాహన కల్పించని ఆఫీసర్లు

నేషనల్‌‌‌‌ ఫ్యామిలీ బెనిఫిట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌పై ఆఫీసర్లకే సరైన అవగాహన లేకుండా పోయింది. ఈ స్కీమ్‌‌‌‌ కింద ప్రతి ఏడాది వేలాది మందికి సాయం అందించే అవకాశం ఉన్నా.. సరైన ప్రచారం లేకపోవడంతో అప్లికేషన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. దీంతో సెర్ప్  సీఈవో దివ్య అన్ని జిల్లాల అడిషనల్‌‌‌‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు.

ఈ స్కీమ్‌‌‌‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీంతో అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు మండల ఆఫీసర్లతో చర్చించి.. అప్లికేషన్లు ఎందుకు రావడం లేదో అడిగి తెలుసుకుంటున్నారు. వితంతు పింఛన్ల కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, వారిలో ఈ స్కీమ్‌‌‌‌కు అర్హులైన వారిని గుర్తించి అప్లికేషన్లు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మండల ఆఫీసర్లు వితంతు పింఛన్ల కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. 

ప్రచారం కల్పించాలి

అనేక మంది కూలీలు, కార్మికులు చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. ఎన్‌ఎఫ్‌బీ స్కీమ్‌కు నిధులు ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేక అప్లికేషన్లు రావడం లేదు. ఈ స్కీమ్‌కు ప్రచారం కల్పిస్తే అప్లికేషన్లు పెరిగే అవకాశం ఉంది. ఆఫీసర్లు స్పందించి స్కీమ్‌ గురించి ప్రచారం చేయాలి.- బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు