- చిరిగిన బట్టలు ధరించి చెప్పులు, చీపుర్లతో జెట్టక్కను తరిమిన వందలాది జనం
కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌లో జెట్టక్క(జేష్ట్యాదేవి)ను గ్రామస్తులు పొలిమేర దాటించారు. గురువారం డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ జెట్టక్కను తరుముతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బట్టలు వేసుకొని చీపుర్లు, చాటలను పట్టుకొని జెట్టక్కను తరిమే వింత ఆచారం ఏండ్లుగా వస్తోంది. ఇందులోభాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిలో బూజు దులిపి జెట్టక్క పోయింది.. లక్ష్మీదేవి వచ్చింది.. అని సంబురపడతారు. పాత దుస్తులు ధరించి, పాత చీపుర్లు, చాటలను పట్టుకుని గ్రామ పొలిమేర వరకు జెట్టక్క వెళ్లిపో అంటూ నినాదాలు, నృత్యాలు చేస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానించారు.
ఊరు పొలిమేరలో ఉన్న చెట్లకు బట్టలు, చీపుర్లు, చాటలు కట్టి స్నానాలు చేసి ఇంటికి వచ్చారు. గ్రామానికి పట్టిన జెట్ట, దరిద్రం, అనారోగ్యం, వివిధ సమస్యలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారని, దీర్ఘకాలిక సమస్యలకు తావుండదని అందుకే ఈ ఆచారం కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. తాత, ముత్తాతల నుంచి వందల ఏండ్లుగా నమ్ముతూ ఈ పండుగ జరుపుకుంటున్నామని చెప్పారు.
