
- జూలై చివర్లో సర్పంచ్ ఎలక్షన్స్
- ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
- నేతలంతా కలిసి పని చేయాలి
కూసుమంచి, వెలుగు: జూన్ చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, జులై చివర్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ నాయకులందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
పాలేరు నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తానని, ఈ నెలనుంచే పార్టీలకతీతంగా సొంతంగా సాయం అందజేస్తామని చెప్పారు. పేదరికంలో ఉన్న స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నెలా 3 రోజుల పాటు 1, 10, 20 వ తేదీల్లో ఈ సాయాన్ని అందిస్తామన్నారు. నిరుపేదలైన వారు ఆసుపత్రిలో ఉంటే వారికి ఆర్థిక సాయం, సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
అప్పు ఉందని చెబితే రాష్ట్రాన్ని చిన్నబుచ్చినట్టా?
సీఎం రేవంత్‌రెడ్డి అనని మాటలను కొందరు అన్నట్లుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్‌ఎస్ లీడర్లు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8.19 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. అప్పు ఉందని చెబితే రాష్ట్రాన్ని చిన్న బుచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతే చెప్పకుండా ఎలా ఉంటామని అడిగారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు తారాజువ్వల్లా ఎగిరి కిందపడిపోతాయని అన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ చేయలేని పనులు.. 16 నెలల్లోనే తాము చేసి చూపించామని చెప్పారు. పీసీసీ పరిశీలకుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయకులు నరేశ్‌రెడ్డి, చావా శివరామకృష్ణయ్య, సీడీసీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి పాల్గొన్నారు.