ఇండియా X పాకిస్తాన్‌‌.. ఒకే గ్రూప్‌‌లో చిరకాల ప్రత్యర్థులు

ఇండియా X పాకిస్తాన్‌‌.. ఒకే గ్రూప్‌‌లో చిరకాల ప్రత్యర్థులు
  • టీ20 వరల్డ్‌‌కప్‌‌ డ్రా విడుదల

దుబాయ్‌‌: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌‌కప్‌‌ డ్రాను ఐసీసీ శుక్రవారం రిలీజ్‌‌ చేసింది. టోర్నీ మొత్తాన్ని రౌండ్‌‌-–1, సూపర్‌‌–-12గా విభజించింది. ప్రధాన టోర్నీలో పాల్గొనే మొత్తం 12 జట్లను (సూపర్‌‌-–12) రెండు గ్రూప్‌‌లుగా విడగొట్టారు. గ్రూప్‌‌-–2లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్‌‌, వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ విన్నర్‌‌ న్యూజిలాండ్‌‌, అఫ్గానిస్తాన్‌‌తో పాటు క్వాలిఫయింగ్‌‌ టోర్నీ నుంచి రెండు జట్లు (ఎ2, బి1) పోటీపడతాయి. గ్రూప్‌‌-–1లో ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌‌తో పాటు క్వాలిఫయింగ్‌‌ టోర్నీ నుంచి మరో రెండు జట్లు (ఎ1, బి2) బరిలోకి దిగుతాయి. 20 మార్చి 2021 వరకు ఉన్న టీమ్‌‌ ర్యాంకింగ్స్‌‌ను బేస్‌‌ చేసుకుని సూపర్‌‌–-12 గ్రూప్స్‌‌ను ప్రకటించారు. ఇక రౌండ్‌‌–-1లో 8 జట్లు రెండు గ్రూప్‌‌లుగా విడిపోయి పోటీపడతాయి. ఈ రెండు గ్రూప్‌‌ల్లోని టాప్‌‌-–2లో నిలిచిన జట్లు సూపర్‌‌–12కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌‌-–ఎలో శ్రీలంక, ఐర్లాండ్‌‌, నెదర్లాండ్స్‌‌, నమీబియా, గ్రూప్‌‌–-బిలో బంగ్లాదేశ్‌‌, స్కాట్లాండ్‌‌, పపువా న్యూగినియా, ఒమన్‌‌ ఉన్నాయి. అక్టోబర్‌‌ 17 నుంచి నవంబర్‌‌ 14 వరకు యూఏఈ, ఒమన్‌‌లో వరల్డ్‌‌కప్‌‌ మ్యాచ్‌‌లు జరగనున్నాయి. ‘గ్రూప్స్‌‌లో కొన్ని గ్రేట్‌‌ మ్యాచ్‌‌లు జరగనున్నాయి. ఫ్యాన్స్‌‌ను కచ్చితంగా అలరిస్తాయని భావిస్తున్నాం. కరోనా పాండమిక్‌‌తో ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉన్న వేళ.. ఈ మ్యాచ్‌‌ల ద్వారా కొంతైన సంతోషాన్ని కలిగిస్తాం. మూడు నెలల తర్వాత అత్యుత్తమ పోటీ ఉన్న క్రికెట్‌‌కు మనం చూడబోతున్నాం’ అని ఐసీసీ యాక్టింగ్‌‌ సీఈవో జెఫ్‌‌ అల్లార్డైస్‌‌ వెల్లడించాడు. మస్కట్‌‌లో డ్రా రిలీజ్‌‌ చేసిన కొన్ని గంటల్లోనే.. బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ, సెక్రటరీ జై షా అక్కడికి చేరుకున్నారు.