ఇతర శాఖల్లోకి వీఆర్వోలు..పోస్టులకు లాటరీ

ఇతర శాఖల్లోకి వీఆర్వోలు..పోస్టులకు లాటరీ
  • వారం కిందనే ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రక్రియ చివరి దశకు చేరే వరకు అంతా గోప్యం
  • రెవెన్యూ శాఖ నుంచి తప్పించడంపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో వీఆర్వోల చాప్టర్​ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్​ చేసింది. 22 నెలల క్రితమే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. వారి డ్యూటీపై తాజాగా నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ మినహా ఇతర శాఖల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయాలని ఆదేశించింది. విద్యార్హతలు, సీనియారిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండా లాటరీ పద్ధతిన వారిని సెలక్ట్ చేసి పోస్టింగ్ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 121 జులై 23నే విడుదలైనప్పటికీ.. బయటికి రాలేదు. వీఆర్వోలు పని చేసేందుకు ఏ ఏ శాఖలో జూనియర్​ అసిస్టెంట్​కు సమానమైన శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయో వెల్లడిస్తూ పలు  జిల్లాల కలెక్టర్లు సోమవారం సర్క్యూలర్​ విడుదల చేశారు. దీంతోపాటు లక్కీ డిప్​ ద్వారా శాఖలు కేటాయించడంతో వీఆర్వోలు కంగుతిన్నారు. కొన్ని జిల్లాల్లోనైతే  మంగళవారం మధ్యాహ్నంలోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 
 

రహస్యంగా ప్రాసెస్​..
రాష్ట్రంలో 5,385 మంది వీఆర్వోలు ఉండగా.. రెవెన్యూ శాఖ మినహా వ్యవసాయం, పశుసంవర్ధక, బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, అటవీ, ఆర్థిక, సివిల్ సప్లయ్​, వైద్య, ఆరోగ్య, విద్య, హోం, ఇండస్ట్రీస్, ఇరిగేషన్, లేబర్, మైనార్టీ వెల్ఫేర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, రవాణా, మహిళా - శిశు సంక్షేమ శాఖల్లో సర్దుబాటు చేస్తున్నారు. లాటరీ పద్ధతిన సెలక్ట్ చేసి పోస్టింగ్ ఇస్తున్నారు. అధికారుల సమక్షంలో వీడియో తీస్తూ ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆర్థిక శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్‌ రాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

దాదాపు మెజార్టీ జిల్లాల్లో లాటరీ ద్వారా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు అధికారులు గోప్యత పాటించారు.  సెలవు, సస్పెన్షన్‌‌ లో ఉన్నవారికి కూడా జిల్లా కేటా యించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక జిల్లాలో పోస్టులు లేకుంటే పక్క జిల్లాలోనైనా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించారు. 
సీనియార్టీకి మంగళమేనా?
ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా పని చేస్తున్న కొద్దీ సర్వీస్ కౌంట్ అవుతుంది. కానీ, వీఆర్వోల సర్దు బాటులో సర్వీస్​ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ​ 
 

2020 సెప్టెంబర్​లోనే వీఆర్వో వ్యవస్థ రద్దు
వీఆర్వోను పోలిన పట్వారీ వ్యవస్థ తెలంగాణ ప్రాం తంలో నిజాం హయాం నుంచే ఉనికిలో ఉంది. 1984లో పటేల్‌‌, పట్వారీ వ్యవస్థను అప్పటి సీఎం ఎన్టీఆర్‌‌ రద్దు చేశారు. వారి స్థానంలో విలేజ్‌‌ అడ్మినిస్ట్రేటివ్‌‌ ఆఫీసర్‌‌(వీఏవో) వ్యవస్థను తీసుకొచ్చారు. 2001లో చంద్రబాబు హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. పంచాయతీరాజ్‌‌, రెవెన్యూ ఇత ర శాఖల నుంచి వచ్చిన వారికి పంచాయతీ కార్య దర్శిగా పోస్టింగ్‌‌ ఇచ్చారు. వీరు భూరికార్డులతో పాటు పంచాయతీ రికార్డులు నిర్వహించేవారు. పంచాయతీ కార్యదర్శులపై ఆరోపణలు రావడంతో 2007లో అప్పటి సీఎం వైఎస్‌‌ ఈ వ్యవస్థను రద్దు చేసి.. వీఆర్వో వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే రెవెన్యూ శాఖలో అవినీతికి వీఆర్వోలే కారణమంటూ 2020 సెప్టెంబర్​లో వీఆర్వో వ్యవస్థను కేసీఆర్‌‌ రద్దు చేశారు. 22 నెలల తర్వాత వీఆర్వోలను ఇతర శాఖల్లో పోస్టింగ్స్​ ఇస్తూ కలెక్టర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.