- ఇంధన వాడకం తగ్గించాలని మోదీ పిలుపునిచ్చిన మరుసటి రోజే ఘటన
- నీతులు సామాన్యులకేగాని, నేతలకు కాదా అంటూ నెటిజన్ల ఆగ్రహం
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇంధన పొదుపు’పై దేశ ప్రజలకు పిలుపునిచ్చిన మరుసటి రోజే, మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఒకరు ప్రదర్శించిన 'కాన్వాయ్ రాజకీయం' తీవ్ర చర్చకు దారితీస్తోంది. మధ్యప్రదేశ్ టెక్ట్స్బుక్స్కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన సౌభాగ్య సింగ్ ఠాకూర్.. సోమవారం బాధ్యతలు స్వీకరించేందుకు 50 కార్ల కాన్వాయ్‌తో ఉజ్జయిని నుంచి భోపాల్‌కు తరలివెళ్లారు.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని తగ్గించేందుకు ప్రజలందరూ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆదివారం తెలంగాణలో జరిగిన సభలో ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు ప్రజా రవాణాను, ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, కార్ పూలింగ్ అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
అయితే, ప్రధాని చెప్పి 24 గంటలు గడవకముందే సొంత పార్టీ నేత 50 కార్లతో ర్యాలీ నిర్వహించడం గమనార్హం. సౌభాగ్య సింగ్ ఠాకూర్ కాన్వాయ్వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నీతి సూత్రాలు కేవలం సామాన్యులకేనా ? నేతలకు వర్తించవా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
