రేవంత్​ను తరిమికొడతం

రేవంత్​ను తరిమికొడతం
  • ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి 

మక్తల్ టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తరిమి కొడతామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో  విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం పాలమూరులో కాంగ్రెస్ నిరుద్యోగ జంగ్ సైరన్ సభలో సీఎం కేసీఆర్ పై రేవంత్​రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పాలమూరులో నిర్వహించింది నిరుద్యోగ జంగ్​ సైరనా లేక పోలీస్ వెహికల్స్, ప్రైవేట్ కంపెనీలకు అమర్చే సైరనా అని ఎద్దేవ చేశారు. ఆంధ్రా పార్టీ నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి రూ. 30 కోట్ల లంచం ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు సీఎం పాదాలను కడిగి నీళ్లను నెత్తిన చల్లుకుంటే గతంలో చేసిన పాపాలు పోతాయని, అంతటి గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ దేశాన్ని శాసించే వ్యక్తి కాబోతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి  పక్కన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు తమను తెలంగాణలో కలపాలని వేడుకుంటున్నారన్నారు. అనంతరం మక్తల్ తహసీల్దార్​ఆఫీసులో 44 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.