సాహసం చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు

సాహసం చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు

పడవల మీద, పుట్టీల మీద  నది దాటడం చూశాం. అయితే గిన్నిస్​ రికార్డ్ సాధించాలంటే వెరైటీగా ఆలోచించాలి. ఈ పెద్దాయన అదే చేశాడు. గుమ్మడి కాయతో చేసిన పడవలో ఎక్కువ దూరం జర్నీ చేసి గిన్నిస్​ రికార్డ్​ల్లోకి ఎక్కాడు. అది కూడా తన అరవయ్యో పుట్టిన రోజున. సాహసం చేయాలనే కోరిక ఉండాలే కానీ వయసు అడ్డంకి కాదని చాటిన ఈయన పేరు డ్యూనే హన్సెన్​. 
ఉండేది అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రంలో.

పోయిన నెల 27వ తేదీన  అరవై ఏండ్ల పుట్టిన రోజు చేసుకున్నాడు హన్సెన్​. ఈయన రైతు. తమ పెరట్లో గుమ్మడికాయలు, సొరకాయలు సాగు చేసేవాడు. తన 60వ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్రేజీగా ఏదైనా చేయాలనుకున్నాడు. అప్పుడే ఈయనకు గుమ్మడికాయ పడవ జర్నీ గుర్తుకొచ్చింది. 2018లో 41 కిలోమీటర్లు జర్నీ చేసి గిన్నిస్​ రికార్డ్ సాధించాడు రికీ స్వెన్సన్​. ఎలాగైనా అతని రికార్డుని బ్రేక్ చేయాలనుకున్నాడు హన్సెన్​. అందుకోసం తన పెరట్లో పండించిన 386 కిలోల బరువున్న ఒక పెద్ద గుమ్మడికాయ పై భాగం తీసి పడవలా మార్చేశాడు.

లైఫ్​ జాకెట్ వేసుకుని అందులో కూర్చొని ముస్సోరీ నదిలో 61 కిలోమీటర్ల దూరం  ఒంటరిగా వెళ్లాడు. ‘‘పెద్ద అలలు వచ్చినప్పుడు ఆగిపోయేవాడిని. అలలు తగ్గాక మళ్లీ ముందుకు వెళ్లేవాడిని. పుట్టిన రోజునాడు అడ్వెంచర్​ చేయడమే కాకుండా గిన్నిస్​ రికార్డ్​ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది” అన్నాడు హన్సన్​. ఉదయం  ఏడున్నరకు జర్నీ మొదలుపెట్టి సాయంత్రం ఆరున్నరకు పూర్తి చేశాడు. కొత్త రికార్డ్ క్రియేట్ చేసేందుకు హన్సెన్​కు11 గంటల టైం పట్టింది.