
- ఖర్చులు, అప్పులు తగ్గించడంపై ఫోకస్
- ఆదాయం పెంచుకునేందుకు కమిటీ నుంచి సూచనలు
- నష్టాల నుంచి గట్టెక్కించడమే ప్రధాన లక్ష్యం
- ఈడీలతో కసరత్తు చేస్తున్న సంస్థ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది. సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ ఈ కమిటీనే చూసుకోనున్నది. ఇద్దరు లేదా ముగ్గురు ఆర్థిక నిపుణులు, ఆర్టీసీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్‌తో పాటు ఓ ఉన్నతాధికారి కమిటీలో సభ్యులుగా ఉంటారు.
అదేవిధంగా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఓ ఉన్నతాధికారిని కమిటీలో భాగస్వామిని చేయాలనుకుంటున్నది. ఈ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం ఐదు నుంచి ఆరుగురు సభ్యులతో ఆర్థిక కమిటీ ఏర్పాటు చేయడంపై సమాలోచనలు చేస్తున్నది. సంస్థలో పెరిగిన నష్టాలు, ఇప్పటి దాకా చేసిన అప్పులకు చెల్లిస్తున్న వడ్డీల భారం తగ్గించుకునేందుకు ఆర్థిక నిపుణుల నుంచి మేనేజ్మెంట్ సలహాలను కోరుతున్నది. అదేవిధంగా, ఆదాయం పెంచుకునే మార్గాలపై కూడా కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటికే ఆర్టీసీపై సీఎం రివ్యూ
ఇప్పటి దాకా ఆర్టీసీ సంస్థ.. ఆర్థికపరమైన వ్యవహారాలను ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన ఒకరిని కన్సల్టెన్సీగా పెట్టుకుని వారి సూచనల మేరకు పని చేసేది. ఆర్టీసీ నష్టాలపై సంస్థ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఆర్టీసీని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.
ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్‌తో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ మేనేజ్మెంట్ నిర్ణయించింది. మహాలక్ష్మి స్కీమ్‌తో సంస్థపై మరింత ఆర్థిక భారం పడుతున్నది. కొత్త బస్సులు కొనాల్సి వస్తున్నది. ఇలాంటి ఆర్థికపరమైన చిక్కుల నుంచి సంస్థను బయటపడేసేందుకు ఫైనాన్స్ కమిటీనే కరెక్ట్ అని యాజమాన్యం నిర్ణయించింది.
సంస్థకు రూ.6,322 కోట్ల అప్పులు
ఆర్టీసీ సంస్థకు రూ.6,322 కోట్ల అప్పులు ఉన్నాయి. దీనికి కట్టే వడ్డీ పర్సెంట్ కూడా ఎక్కువే ఉన్నది. తక్కువ వడ్డీ చెల్లించే మార్గాలను అన్వేషించాల్సిందిగా ఆర్టీసీ అధికారులను రేవంత్ సూచించారు. అదేవిధంగా, అప్పుల భారం కూడా తగ్గించే మార్గంపై కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంస్థ ఎండీ సజ్జనార్.. మూడు రోజుల కింద ఆర్టీసీ ఈడీలతో పాటు అదే స్థాయి పోస్టులో ఉన్న ఫైనాన్స్ వింగ్ హెడ్‌తో సమావేశం అయ్యారు.
వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటేనే ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్యానికి సూచించారు. ఇందులో భాగంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను సంస్థకు మంచి ఆదాయ మార్గాలుగా చేసుకునే ప్రయత్నంలో యాజమాన్యం ఉన్నది.
రానున్న మూడు నెలల్లో మూడు పెద్ద పండుగలు ఉన్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. రద్దీ ఉన్న రూట్లలో అదనపు బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది.