
చెన్నూరు, వెలుగు: విద్యాసంస్థల్లో చేపట్టిన పనులను స్పీడప్ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. చెన్నూర్ మండలం కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించి కాలేజీ పరిధిలో, చెన్నూర్‌లోని గిరిజన సంక్షేమ బాలుర హైస్కూల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణం పనులను గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. పనులు త్వరగా పూర్తిచేసేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి చెన్నూర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు.
తెగిన మేడి చెరువు తూమును పరిశీలించిన కలెక్టర్, అధికారులు
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం గాంధారీఖిల్లా వద్ద గండిపడిన మేడిచెరువు కట్ట, కొట్టుకుపోయిన తూము ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. రెండ్రోజుల క్రితం భారీ వర్షంతో తూము కొట్టుకుపోగా.. చెరువు కట్టకు రిపేర్లు చేపట్టాలని రైతులు, గ్రామస్తులు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్ తెగిన చెరువు తూము ప్రాంతాన్ని ఇరిగేషన్ డీఈ శారద, మందమర్రి తహసీల్దార్ సతీశ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.
ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తూము రిపేర్లు చేపట్టాలన్నారు. ఫండ్స్ఎస్టిమేట్ వేసి వచ్చే నెలలో టెండర్లు పిలిచి పనులు చేపడుతామని డీఈ శారద కలెక్టర్‌కు తెలియజేశారు. ఇరిగేషన్ సీఈ సత్యరాజ్‌చంద్ర, ఎస్ఈ విష్ణుప్రసాద్ గండిపడ్డ చెరువును పరిశీలించారు. చెరువు అభివృద్ధిపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆఫీసర్ల వెంట మందమర్రి ఆర్ఐ రాథోడ్ గణపతి, ఇరిగేషన్ఏఈ సునీత, సూపర్వైజర్ చంద్రమౌళి తదితరులున్నారు.