క్యాన్సర్​ డ్రగ్​​ పరిశోధనలో మంచిర్యాల వాసి

క్యాన్సర్​ డ్రగ్​​ పరిశోధనలో మంచిర్యాల వాసి

పుట్టింది తెలంగాణలోని మారుమూల పల్లెలో. చదివింది సర్కార్‌‌‌‌ బడిలో. ఇప్పుడు మస్సాచుసెట్స్​ ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఎంఐటీ)లో రీసెర్చ్‌‌ చేస్తుండు. క్యాన్సర్‌‌‌‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు డ్రగ్‌‌ కనిపెట్టే పనిలో పడ్డడు. పెద్ద పెద్ద సైంటిస్టులతో పనిచేస్తున్నడు గందెసిరి సతీష్. ఇంకో రెండేండ్లలో డ్రగ్​ రీసెర్చ్‌‌​ పూర్తి చేస్తానని, ఇండియాలో క్యాన్సర్​ రీసెర్చ్ 
స్టార్టప్​ను ప్రారంభిస్తానని అంటున్నడు. 

క్యాన్సర్​కు శక్తివంతమైన డ్రగ్​ను కనిపెట్టడమే నా ముందున్న లక్ష్యం. ఎంఐటీలో రెండేళ్ల రీసెర్చ్​ కంప్లీట్​ కాగానే ఇండియాకు వచ్చి క్యాన్సర్​ రీసెర్చ్​ స్టార్టప్​ను ప్రారంభించాలనుకుంటున్న. ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్​ వ్యాధిపై పోరాటం చేస్తా. నాలాంటి రూరల్​ బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చే యూత్​కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను” అంటున్నాడు గందెసిరి సతీష్‌‌.  

చిన్నప్పటినుంచి చదువే లోకం... 

ఈయనది మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం. చిన్నప్పటి నుంచి చదువే లోకం. ఆయన తల్లిదండ్రులు శ్రీరాములు, దీప. కిరాణ షాప్‌‌ నడిపేవారు. సతీష్​ టెన్త్​ వరకు ఊరిలోని సర్కార్‌‌‌‌ బడిలోనే చదివాడు. ఆ తర్వాత బెల్లంపల్లిలోని ప్రగతి​ జూనియర్​ కాలేజీలో ఇంటర్​ చదివి, హన్మకొండలోని వాగ్దేవి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎస్​ఆర్​ కాలేజీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్​ కెమిస్ర్టీ పూర్తి చేశాడు. సీఎస్​ఐఆర్​/జీఆర్​ఎఫ్​లో ఆలిండియా 160వ ర్యాంక్​ సాధించి, గేట్​లోనూ ప్రతిభచాటాడు. తమిళనాడులోని భారతీదాసన్​ యూనివర్సిటీ నుంచి 2016లో ఆర్గానిక్​ కెమిస్ర్టీలో పీహెచ్​డీ చేసి.. హైదరాబాద్​లోని ఏఎంఆర్​లో సీనియర్​ రీసెర్చ్​ అసోసియేట్​గా, చండీగఢ్​లోని ఇండ్​ స్విఫ్ట్​ ల్యాబొరేటరీస్​లో రీసెర్చ్​ ఆఫీసర్​గా పనిచేశాడు. 

ఫేమస్​ సైంటిస్టులతో రీసెర్చ్​...

క్యాన్సర్ మహమ్మారికి మందు కనిపెట్టాలనే ఉద్దేశంతో టెక్నియన్​ ఇజ్రాయిల్​ ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో పోస్ట్​ డాక్టోరల్​ రీసెర్చర్​గా చేరాడు సతీష్‌‌. నోబెల్‌‌ ప్రైజ్‌‌ విన్నర్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ ఆరాన్‌‌ సిక్‌‌నోవర్‌‌‌‌, మరో సైంటిస్ట్‌‌ ఆష్రాఫ్‌‌ బ్రిక్‌‌తో కలిసి ‘సింథసిస్​ ఆఫ్​ హ్యూమన్​ ప్రొటీన్స్​ అండ్​ ప్రొటాక్స్​ ఫర్ టార్గెట్​ ప్రొటీన్​ డిగ్రేడేషన్​ ఇన్​ క్యాన్సర్’​పై మూడున్నరేండ్లు రీసెర్చ్‌‌​ చేశాడు. ‘కెమికల్‌‌ సింథసిస్‌‌ ఆఫ్‌‌ ప్రొటీన్స్‌‌’ అనే సైన్స్‌‌ జర్నల్‌‌లో ఒక చాప్టర్‌‌‌‌ రాశాడు సతీష్​. ఆ జర్నల్‌‌లో రాసిన ఏకైక ఇండియన్‌‌ సతీష్​. క్యాన్సర్‌‌‌‌కు డ్రగ్‌‌ కనిపెట్టాలనే లక్ష్యంతో మస్సాచుసెట్స్​ ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో పోస్ట్​ డాక్టోరల్​ అసోసియేట్​గా చేరాడు.  ప్రొఫెసర్​ బ్రాడ్లీ పెంటలూట్​తో కలిసి ‘ఆటోమేటెడ్​ ఫాస్ట్​ ఫ్లో సింథసిస్​ ఆఫ్​ హ్యూమన్​ ప్రొటీన్స్​ అండ్​ డ్రగ్​ డెవలప్​మెంట్​పై’ రీసెర్చ్‌‌ చేస్తున్నాడు. త్వరలోనే క్యాన్సర్‌‌‌‌కు డ్రగ్‌‌ కనిపెడతామంటున్నాడు.  
::: మంచిర్యాల, వెలుగు