పొత్తులపై చర్చించలే.. సీపీఐతో అనధికారిక మీటింగ్ జరిగింది

పొత్తులపై చర్చించలే.. సీపీఐతో అనధికారిక మీటింగ్ జరిగింది
  • కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌‌చార్జ్ మాణిక్‌‌ ఠాక్రే
  • తమకు మద్దతిచ్చేందుకు చాలా పార్టీలు వస్తున్నాయని వెల్లడి
  • షర్మిల పార్టీని విలీనం చేసే అంశం తన పరిధిలో లేదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు గురించి అధికారికంగా చర్చలేవీ జరగలేదని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌‌చార్జ్‌‌ మాణిక్‌‌రావు ఠాక్రే చెప్పారు. సీపీఐతో అనధికారిక మీటింగ్ మాత్రం జరిగిందని, పొత్తులు, సీట్ల కేటాయింపు గురించి ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. కేవలం ప్రాథమిక సంభాషణ మాత్రమే జరిగిందని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌‌లో ఆయన చిట్‌‌చాట్ చేశారు. పొత్తుల చర్చలు సీఎల్పీ లీడర్, పీసీసీ ప్రెసిడెంట్‌‌ సమక్షంలోనే జరుగుతాయని, తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌‌కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో రెగ్యులర్‌‌‌‌గా మాట్లాడడం సహజంగా జరుగుతుందన్నారు. తనను కలవడానికి చాలా మంది వస్తుంటారని, మందకృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య, ఇతర సంఘాల నేతలు కూడా వచ్చి కలిశారని వివరించారు.

బీసీలకు ఎక్కువ సీట్లు

వచ్చే ఎన్నికల్లో బీసీలకు సాధ్యమైనంత ఎక్కువ సీట్లు ఇవ్వాలని నిర్ణయించామని ఠాక్రే తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకే కేటాయిస్తామని చెప్పారు. ఏయే సీట్లు కేటాయించాలి అనేదానిపై పరిశీలిన జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌‌లో ప్రజాస్వామ్యయుతంగా సీట్ల ప్రకటన ఉంటుందని, బీఆర్‌‌‌‌ఎస్ కుటుంబ పార్టీ కాబట్టి కేసీఆర్ సొంతంగా టికెట్ల ప్రకటన చేశారని విమర్శించారు. కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్టు, కాంగ్రెస్‌‌లో తీసుకోవడం కుదరదన్నారు. ఇక షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌‌లో విలీనం చేసే అంశం తన పరిధిలో లేదని ఠాక్రే స్పష్టం చేశారు.