
ఇంఫాల్: మణిపూర్ ఖమెన్లోక్ ఏరియాలోని ఓ గ్రామంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. మరో పదిమంది గాయపడ్డారని అధికారులు బుధవారం తెలి పారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా కంగ్పోకీ బోర్డర్లో ఉన్న కుకీ గ్రామాన్ని సాయుధ దుండగులు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో చట్టుముట్టి కాల్పులు జరిపారు. గన్ఫైర్లో ఇరువర్గాలవారు గాయపడ్డారు. వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని 16 జిల్లాలకు గానూ 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఇప్పటి వరకు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల కర్ఫ్యూకు సడలింపు ఇవ్వగా.. తాజా ఘటనతో ఈ సమయాన్ని ఉదయం 5 నుంచి 9 గంటల వరకు అధికారులు కుదించారు. మణిపూర్‌లోని మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 100 మందికిపైగా మరణించారని, 310 మందికిపైగా గాయపడ్డారని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.