
- కర్రెగుట్టల్లో భారీగా సామగ్రి స్వాధీనం చేసుకున్న జవాన్లు
భద్రాచలం, వెలుగు: తెలంగాణ బార్డర్‌లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. జవాన్ల రాకను గమనించిన మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రాతో పాటు 229, 153, 196 బెటాలియన్ల జవాన్లు పక్కా సమాచారంతో కర్రెగుట్టల్లోని తడపల అటవీ ప్రాంతానికి వెళ్లారు. కూంబింగ్ చేస్తూ మావోయిస్టులు ఆయుధాలు తయారు చేసే కేంద్రాన్ని గుర్తించారు.
51 బీజీఎల్‌లు, 100 బండిళ్ల అల్యూమినియం వైరు, బీజీఎల్‌లు తయారు చేసేందుకు వాడే 50 స్టీల్ పైపులు, 20 ఐరన్ షీట్లు, 40 ఐరన్ ప్లేట్లు, 5 ఐఈడీ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతాబలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు ప్లాన్ చేశారని, దానిని నిర్వీర్యం చేశామని బీజాపూర్ పోలీసులు ప్రకటించారు.
బీజేపీ కార్యకర్త హత్య..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం బీజేపీ కార్యకర్తను హత్య చేశారు. జిల్లాలోని ఇల్మిడి పోలీస్ స్టేషన్ సమీపంలోని ముంజాల్ కాంకేర్ గ్రామంలో సాయుధులైన మావోయిస్టులు ఉదయం 4 గంటల సమయంలో పూనెం సత్యం ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యుల ఎదుటే కత్తితో పీక కోసి చంపారు. అనంతరం అక్కడ ఒక లేఖను వదిలారు. పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని, గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా దళాల ఆచూకీ పోలీసులకు చేరవేస్తున్నాడని ఆరోపించారు.
ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు
భద్రాద్రికొత్తగూడెం: ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీలో సీనియర్ నేతలు దామోదర్, ఆజాద్‌కు గార్డులుగా పని చేసిన లేఖం బండి అలియాస్ శాంతి, మడవి కోసాతో పాటు పార్టీ మెంబర్ కుంజం పాపారావు, మిలీషియా మెంబర్ మడవి లక్మా, దొడ్డి భద్రు లొంగిపోయిన వారిలో ఉన్నారు. లొంగిపోయిన వారికి రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థికసాయం అందించామని తెలిపారు.