- పథకం పేరు పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మార్పు
- రోజువారీ కూలి రూ. 240.. రెండు దశల్లో 2027 జనాభా లెక్కలు.. రూ.11,718 కోట్లు కేటాయింపు
- దేశ చరిత్రలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సెన్సస్
- కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి అనుమతి ఇచ్చే బిల్లుకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఈ పథకాన్ని ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’గా వ్యవహరించనుంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ఉపాధి హామీ గరిష్ట పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచారు. రోజువారీ కనీస కూలీని రూ. 240గా నిర్ణయించారు. 2005లో ‘నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్’ (ఎన్ఆర్ఈజీఏ)గా ప్రారంభమైన ఈ పథకాన్ని.. 2006లో ‘మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్’ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)గా పేరు మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల హామీ ఉపాధిని అందించే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పేరు మార్పుతోపాటు పనిదినాలను పెంచుతూ కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
డిజిటల్ విధానంలో 2027 జనాభా లెక్కలు
భారత జనాభా లెక్కలు-2027 నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియ కోసం రూ. 11,718.24 కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయించింది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్ని రెండు దశల్లో నిర్వహించనున్నారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాలను జాబితా చేసి, లెక్కింపు చేపడతారు. ప్రతి రాష్ట్రంలో 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణపై దృష్టిపెడతామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
దేశంలో ఇదే తొలి డిజిటల్ జనగణన అవుతుందని పేర్కొన్నారు. ఈ జనాభా లెక్కల్లోనే కుల గణన కూడా చేస్తామని చెప్పారు. లడఖ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో మాత్రం జనాభా లెక్కింపును 2026 సెప్టెంబర్‌లోనే పూర్తి చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 30 లక్షల మంది ఫీల్డ్ సిబ్బంది పాల్గొంటారని చెప్పారు.
కొబ్బరికి కొత్త ఎంఎస్పీ
కేంద్ర ప్రభుత్వం 2026 మార్కెటింగ్ సీజన్‌కు మిల్లింగ్ కొబ్బరికి క్వింటాలుకు రూ.12,027 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) నిర్ణయించింది. ఇది మునుపటి సీజన్‌తో పోలిస్తే రూ. 445 ఎక్కువ. అలాగే, బాల్ కొబ్బరికి క్వింటాల్‌కు రూ.12,500 ఎంఎస్పీని ఫిక్స్ చేసింది. ఇది మునుపటి సీజన్‌తో పోలిస్తే రూ. 400 ఎక్కువ. ఇది కొబ్బరి ఉత్పత్తిని పెంచడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఏఎఫ్‌ఈడీ), నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్) మద్దతు ధర పథకం కింద కొబ్బరి సేకరణకు కేంద్ర నోడల్ ఏజెన్సీలుగా కొనసాగుతాయని వివరించారు.
‘కోల్‌సేతు’కు ఆమోదం..
దేశంలో బొగ్గు అనుసంధాన విధానంలో కేంద్రం కీలక సంస్కరణలు తీసుకువచ్చింది. ‘కోల్ సేతు’ విండో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బొగ్గు సరఫరాలో మరింత పారదర్శకత, సామర్థ్యం పెంచడానికి ఈ కొత్త విధానం దోహదపడుతుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2016 నాటి నాన్ -రెగ్యులేటెడ్ సెక్టార్ లింకేజ్ వేలం విధానానికి కోల్‌సేతు విండోను జోడిస్తామని, దీనిద్వారా ఏదైనా పారిశ్రామిక వినియోగం, ఎగుమతి కోసం దీర్ఘకాలికంగా వేలం ప్రాతిపదికన బొగ్గు లింకేజీలను కేటాయించడానికి వీలవుతుందని చెప్పారు. బొగ్గు అవసరమయ్యే ఏ దేశీయ కొనుగోలుదారుడైనా తుది వినియోగంతో సంబంధం లేకుండా లింకేజ్ వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.
ఇన్సూరెన్స్ సెక్టార్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం జనరల్, లైఫ్, హెల్త్ బీమాలో 74% వరకు ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. ఈ రంగంలోకి ఎఫ్‌డీఐలకు పూర్తిగా అనుమతినిస్తే దేశంలోని ఈ మార్కెట్‌ను మరింత బలోపేతం చేసి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పోటీని పెంచడానికి, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని కేంద్రం భావిస్తున్నది. ఈ నిర్ణయంతో విదేశీ కంపెనీలు పూర్తిగా బాధ్యతలు చేపట్టవచ్చు. ఇండియన్ పార్ట్‌నర్ల అవసరం తగ్గుతుంది.
71 చట్టాలు రద్దు
నిరుపయోగంగా మారిన చట్టాలను తొలగించి, పాలనలో సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో 71 చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 71 చట్టాల్లో 65 ప్రధాన చట్టాలకు చేసిన సవరణలు ఉండగా, ఆరు ప్రధాన చట్టాలు ఉన్నాయి. ఇందులో కనీసం ఒకటి బ్రిటిష్ కాలం నాటి చట్టం కూడా ఉన్నది. ప్రస్తుత కాలమానానికి తగ్గట్టుగా లేని పాత చట్టాలు రద్దు చేయడం వల్ల వ్యవస్థలో మరింత స్పష్టత, పారదర్శకత పెరుగుతాయని కేంద్రం భావిస్తున్నది. కేసుల సంఖ్యను తగ్గించి, న్యాయ వ్యవస్థ పనితీరును వేగవంతం చేయడంలో ఈ నిర్ణయం సహాయపడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

