మేడారం జాతరలో భాగంగా భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించే క్రమంలో బంగారం (బెల్లం)తో పాటు కోళ్లు, మేకలను బలివ్వడం ఆనవాయితీ. దీంతో జాతర వద్ద వీటి ధరలకు రెక్కొలచ్చాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు జాతర వద్దే కోళ్లు, మేకలను కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారులు వాటి రేట్లను భారీగా పెంచేశారు.
మేకపోతు లైవ్ కిలో రూ.420 ఉండగా.. మేడారంలో రూ.900 నుంచి 1000 వరకు అమ్ముతున్నారు. మటన్ ఏకంగా రూ. 1500 చెబుతున్నారు. అలాగే బయట రూ.170 నుంచి 180 దొరికే కిలో కోడిని రూ.300 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారు. రూ. 350 నుంచి రూ. 400 మధ్య ఉండే కిలో నాటుకోడిని రూ.700లకు అమ్ముతున్నారు. జాతర జరిగే చివరి మూడు రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
