హుజురాబాద్ లో అందరికీ వ్యాక్సినేషన్

హుజురాబాద్ లో అందరికీ వ్యాక్సినేషన్
  • కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల పరిశీలనకు వైద్య బృందం

కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి కరోనా కేసుల పెరుగుదలకు దారితీస్తుండడంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలనకు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం పలు ఆస్పత్రులను పరిశీలించింది. జమ్మికుంట ఆస్పత్రి సందర్శన సందర్భంగా  హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. 
రాష్ట్రమంతా అదుపులోనే ఉన్నా హుజూరాబాద్ లోనే పెరుగుతున్నాయి
కరోనా కేసులు రాష్ట్రమంతా అదుపులోనే ఉన్నా.. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పెరుగుతున్నాయని, హుజూరాబాద్ లో రాజకీయ కార్యక్రమాల వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో కోవిడ్ స్థితిగతులను చూడటానికి వైద్య ఆరోగ్య శాఖ బృందం రావడం జరిగిందని జమ్మికుంట హెల్త్ సెంటర్ లో కోవిడ్ పేషేంట్స్ కోసం ఐసోలేషన్,  ఆక్సిజన్ సెంటర్  ఏర్పాటు చేశామన్నారు. హుజురాబాద్ లో పొలిటికల్ ఆక్టివిటి ఎక్కువ కావడం వల్ల ఇక్కడ మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామన్నారు. గత నాలుగు వారాల క్రితం కూడా ఇక్కడ విజిట్  చేశామని, మళ్లీ ఇప్పుడు పరిశీలన చేస్తున్నామన్నారు. ఇవాళ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ లు సూపరింటెండెంట్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. జమ్మికుంట కమ్యూనిటీ సెంటర్లో గత నాలుగు నెలలుగా కోవిడ్ సేవలు అందించడం జరుగుతోందని, రేపటి నుండి నాన్ కోవిడ్ సేవలను అందించే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. హుజురాబాద్ లో రాబోయే ఉప ఏ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రత్యకంగా మొదటి,  రెండు విడుత డోస్ వ్యాక్సినేషన్ కు అర్హులైన వారందరికీ నాలుగైదు రోజులలో వ్యాక్సినేషన్ అందించాడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.