వామ్మో ఓరి నాయనో... పచ్చిమిర్చి రూ.120 టమాట రూ.50

వామ్మో ఓరి నాయనో... పచ్చిమిర్చి రూ.120 టమాట రూ.50
  •  భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు
  • బీరకాయ, వంకాయ, క్యాప్సికం..ఏదైనా కిలో రూ.80 
  • చింతపండు రూ.120, అల్లం 200.. ఎల్లిగడ్డ రూ.320
  • పల్లినూనె రూ.180.. కందిపప్పు రూ. 200
  • రెండు, మూడు రోజుల్లోనే 30 శాతం పెంపు

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు భగ్గుమంటున్నాయి. వందో, రెండు వందలో పట్టుకుని మార్కెట్​కు పోతే రెండు రకాల కూరగాయలు కూడా రావట్లేదు. పప్పులు వండుకుని తిందామంటే వాటి రేట్లు కూడా అలాగే ఉన్నాయి. చివరకు పచ్చిపులుసుతో అడ్జస్ట్ అవుదామనుకుంటే చింతపండు ధర సైతం భయపెడుతోంది. వారం, పది రోజుల కింది వరకు అందుబాటులోనే ఉన్న ధరలు రెండు, మూడు రోజుల్లోనే 20 నుంచి 30 శాతం పెరిగాయి. దీంతో సాధారణ ప్రజలు అల్లాడుతున్నారు. 

భయపెడుతున్న ధరలు 

నిన్నమొన్నటి వరకు రూ.25 నుంచి 30 వరకు దొరికిన టమాటకు ఇప్పుడు కిలో రూ.50 చెబుతున్నారు. పచ్చిమిర్చి క్వాలిటీ ఆధారంగా రూ.80 ఉండగా రూ.120 అయింది. బీరకాయ రూ.80 ఉండగా, వంకాయకు రూ.60 నుంచి 70, బెండకాయ, దొండ కాయకు రూ.60 చెప్తున్నారు. సోమవారం కిలో రూ.68 ఉన్న క్యాప్సికం మంగళవారం రూ.85 పలికింది.  

రూ.15–20 ఉండే దేశవాళీ సొరకాయ రూ.48 ఉంది. ఒక్క మునక్కాయ రూ.12–15 అయింది. చిన్నకొత్తిమీర కట్ట రూ.6 ఉండగా రూ.10 చేశారు. తోటకూర ఇంతకుముందు రూ. 20కి నాలుగు కట్టలు ఇచ్చేవారు.  ఇప్పుడు రూ.50 పెట్టాల్సి వస్తోంది. పాలకూర, చుక్కకూర 20కి మూడు, నాలుగు కట్టలుండగా రూ. 30 నుంచి రూ. 40కి చేరింది. రూ. 20కి ఐదు నిమ్మకాయలు ఇచ్చేవారు ప్రస్తుత మూడు కూడా ఇవ్వడం లేదు.  

మండుతున్న పప్పులు..నూనెలు

కూరగాయల తర్వాత వంటల్లో ఎక్కువగా వాడే పప్పుల రేట్లు అంతకంటే ఎక్కువే అయ్యాయి. మొన్నటి వరకు కిలో రూ.110–120 పలికిన కందిపప్పు ఇప్పుడు రూ.200కు చేరింది. క్వాలిటీ ఆధారంగా శనగపప్పు రూ.90–100, మైసూర్‍ పప్పు రూ.110–120,  పెసర పప్పు రూ.140, మినుముల పప్పు రూ.140–150 అయింది.  పల్లినూనె కిలో రూ.180–190 ఉండగా.. సన్​ ఫ్లవర్​ ఆయిల్​​120–125 వరకు అమ్ముతున్నారు. అల్లం కిలో రూ.200 ఉంటే ఎల్లిగడ్డ రూ.320 పలుకుతోంది. చింతపండు కూడా రూ.120–130 అవడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. 

చికెన్‍ రూ.300.. మటన్‍ రూ.1000

మార్కెట్​లో నాన్‍వెజ్‍ రేట్లు అలానే ఉన్నాయి. బ్రాయిలర్‍ స్కిన్‍లెస్‍ చికెన్‍ నిన్నమొన్నటి వరకు రూ.260 ఉండగా ఇప్పుడు రూ.300 అయింది. విత్‍ స్కిన్‍ రూ.180–190 ఉండగా దీనిని రూ.260 చేశారు. పొట్టేలు మటన్ కిలో  రూ.1000 చొప్పున విక్రయిస్తున్నారు. రూ.5 ఉండే కోడిగుడ్డు రేటు కూడా రూ.7కు చేరింది. దీంతో ఆదివారం లేదంటే ఏదైనా సెలబ్రెషన్‍ చేసుకుందామంటే మిడిల్‍ క్లాస్‍ జనాలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.  

90 శాతం పక్క రాష్ట్రాల నుంచే దిగుబడి

మామూలుగానే రాష్ట్రంలో కూరగాయల సాగు కొంత తక్కువగా ఉంది. ఎండాకాలం మనకు వచ్చే కూరగాయల్లో దాదాపు 80 శాతం పక్క రాష్ట్రాల నుంచే దిగుబడి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మండే ఎండలకు తోడు..చాలా ఏరియాల్లో గ్రౌండ్‍ వాటర్ తగ్గడంతో ఈసారి 90 శాతం కూరగాయలు ఆంధ్రా, కర్నాటక, మధ్యప్రదేశ్‍ రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకుంటున్నట్లు వరంగల్‍ మార్కెట్‍ అధికారులు తెలిపారు.

 టమాట ఆంధ్రప్రదేశ్‍లోని చిత్తూర్‍ జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి, మిర్చి మధ్యప్రదేశ్‍, ఇతర కూరగాయలతో పాటు క్యారెట్‍, క్యాప్సికం వంటివి కర్నాటక నుంచి ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి చెడగొట్టు వానల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో అవసరానికి అనుగుణంగా సాగు లేక మార్కెట్లకు స్టాక్‍ రావడం తగ్గింది. 

సిటీలో బతుకుడు కష్టమే  

ఊళ్లో సొంత భూముల్లేక సిటీలో కాయకష్టం చేసుకుందామని వచ్చినోళ్లు.. ఇప్పుడిప్పుడే ప్రైవేట్‍ ఉద్యోగాలు దొరికి పెళ్లిళ్లు చేసుకున్నోళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే జీతం ఇల్లు గడవడానికి కూడా సరిపోవడం లేదు. రూ.12 వేల నుంచి రూ.15 వేల జీతం వచ్చేటోళ్లు కూరగాయల ధరలు, ఇంటి కిరాయిలు, కరెంట్ బిల్లులతో సిటీలో బతుకుడు కష్టమే అవుతోంది.

కూరగాయల రేట్లు మస్తు పిరమైనయ్​ 

కూరగాయల రేట్లు మస్తు పిరమైనయ్‍. మొన్నటివరకు రూ.100 పట్టుకెళ్తే కనీసం రెండు, మూడు రోజులకు సరిపడే కూరగాయలు వచ్చినయ్‍. ఇప్పుడు ఏది అడిగినా కిలో 80 నుంచి 100 అంటున్రు. అప్పట్లెక్క అన్ని రకాలు కూడా దొర్కుతలేవు. మొన్నటివరకు నెలకు కూరగాయలకు రూ.1000 నుంచి 1200 ఖర్చయితే ఇప్పుడు పది రోజులకు కూడా వస్తలేవు.  

-  మొట్లపల్లి రాజు, హనుమకొండ

నీళ్లు లెవ్వు..వానలకు పంటలు దెబ్బతిన్నయ్‍

మన జిల్లాల కూరగాయలు పండించేటోళ్లు తక్కువే. నేనే ఏటా కొంత టమాట ఏస్తున్నా. ఈసారి టమాట, బీరకాయ పెట్టినా. బావుల్లో నీళ్లు లెవ్వు. గ్రౌండ్‍ వాటర్ తగ్గింది. అందుకే పూత సరిగ్గా ఎల్లలేదు. ఎంతో కొంత పండిందనుకునే టైంల మొన్న వర్షాలు కురవడంతో ఆ పంట కూడా సరిగ్గా చేతికి రాలే. మేం మార్కెట్​కు పోతెనేమో వ్యాపారులు రేట్ లేదంటున్నరు. బయట చూస్తేనేమో ఏది చూసినా రూ.80 కంటే తక్కువ అమ్ముతలేరు. మధ్యలో మా రైతులే అన్యాయానికి గురవుతున్నరు.

‌‌‌‌ - కుడుతాల వీరన్న, రైతు, 
   నారక్కపేట, నర్సంపేట