దీపావళిలోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మిలియన్ మార్చ్

V6 Velugu Posted on Sep 25, 2021

  • మనకు ఇదే చివరి పోరాటం.. ఇదే చివరి ఉద్యమం కావాలి
  • మనకు మళ్లీ బలిదానాలు వద్దు
  • ప్రజాసంగ్రామ పాదయాత్రలో బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల: దీపావళిలోగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మిలియన్ మార్చ్ చేపడతామని.. మనకు ఇదే చివరి పోరాటం.. ఇదే చివరి ఉద్యమం కావాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మనకు మళ్లీ బలిదానాలు వద్దని ఆయన హితవు పలికారు. ప్రజాసంగ్రామ పాదయాత్ర శనివారం తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ డిగ్రీలు, పీజీలు చేసిన ఎందరో ఇప్పుడు కూలీ పనులకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందరో బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. 
ఇంటికో ఉద్యోగం ఏమైంది? డీఎస్సీ ఏమైంది? 
‘‘ఇంటింటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఏమైందో తెలియదు.. డీఎస్సీ కూడా ఏమైందో తెల్వడం లేదు, విద్యావలంటీర్లను తొలగించిండ్రు,  7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిండ్రు, విద్యా వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నరు. విద్యా వలంటీర్లను కోరుట్లలో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ నియమిస్తే....సంబంధిత ఎంఈవో, ప్రధానోపాధ్యాయులను కేసీఆర్ సస్పెండ్ చేసిండ్రు. వాళ్లు చేసిన తప్పేమిటి? తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలి. లేనిపక్షంలో బీజేపీ తడాఖా చూపిస్తాం..’’ అని బండి సంజయ్ హెచ్చరించారు. 
ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం ఖాయం
‘ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే వరకు, నిరుద్యోగ భ్రుతి ఇచ్చే వరకు బీజేపీ పోరాడుతుంది. ఉద్యమాన్ని ఉద్రుతంగా చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం ఖాయం. గొల్లకొండపై కాషాయా జెండాను రెపరెపలాడించడం ఖాయం..’ అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత అవి రాకపోవడంతో.. మళ్లీ గల్ఫ్ కు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు,మనం ఉద్యమం చేసింది ఎవరి కోసం.. మన ఉద్యోగాల కోసమే కదా ? అని ఆయన ప్రశ్నించారు. 25 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తారట అని ఆయన తెలిపారు. దీపావళి నాటికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే.. ఆ తర్వాత బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ చేస్తామని హెచ్చరించారు. మేం చేసే మిలియన్ మార్చ్ తో నీ ప్రభుత్వం కుప్ప కూలిపోవడం ఖాయం. నిరుద్యోగులు, బీజేపీ నీకు భయపడరు అని ఆయన స్పష్టం చేశారు. అనాడు సుష్మాస్వరాజ్ బలిదానాలు వద్దని పార్లమెంట్ లో చెప్పారు. కానీ ఏనాడు కేసీఆర్ బలిదానాలు వద్దని చెప్పలేదన్నారు. 
ఢీల్లీ వెళ్లిన కేసీఆర్.. మళ్లీ కోతలు మొదలు పెడతాడు
ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మళ్లీ వచ్చి కోతలు మొదలుపెడతాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇక్కడున్నా ఒక్కటే.. ఢిల్లీలో ఉన్నా ఒక్కటేనన్నారు. గతంలో ప్రతి గింజ నేనే కొంటా.. కేంద్రం పెత్తనమేందన్న కేసీఆర్.. ఇప్పుడు వరి వేస్తే ఉరే అంటున్నాడని విమర్శించారు. కేంద్రం పోయి ఒప్పించాను.. ఇప్పుడు కొంటామని ఇక్కడికొచ్చి కేసీఆర్ చెబుతాడు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా త్వరలో నోటిఫికేషన్ అంటాడు, ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలొచ్చాయి. ఇక నమ్ముతామా? అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు హిందుగాళ్లు, బొందుగాళ్లు అన్నప్పుడే కరీంనగర్ పౌరుషం చూపించాం, గతంలో పాస్ పోర్టుల దందా చేసి ఎందరినో ముంచాడు, అందుకే ఇప్పుడు ఆ బుద్ధి పోనిచ్చుకోవడం లేదు, గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు, ఎంతో ఖర్చు చేసి, కష్టాలు పడి గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్లు ఇబ్బందులు పడుతుంటే సీఎం పట్టించుకోవడం లేదన్నారు.  
కేసీఆర్ రెండు రోజులకే దీక్ష ఆపి దొంగదీక్ష చేశాడు
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రెండు రోజులకే దీక్ష ఆపితే ఆనాడు ఉస్మానియా విద్యార్థులు అంతిమ యాత్ర చేస్తామంటే మళ్లీ దీక్ష కొనసాగించిండని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ దీక్ష వట్టిదేనని, అంతా నాటకమని ఢిల్లీలో ఓ రిపోర్టర్ నాకు చెప్పాడని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పోతే మోడీ గంట సమయమిచ్చాడని చెప్పుకున్నాడు, కానీ మాట్లాడింది ఐదు నిమిషాలేనన్నారు. రైతు బంధు ఇచ్చి రైతులకు అన్ని సబ్సిడీలు బంద్ చేసిన మూర్ఖపు సీఎం కేసీఆర్ కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నడని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్య వ్యాఖ్యలవల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. మిడ్ మానేరు బాధితులకు పరిహారం అందక ఆత్మహత్య చేసుకుంటున్నరని ఆయన ఆరోపించారు. ఇక ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, తెలంగాణలో మార్పు కోసం, అవినీతి, మూర్ఖత్వపు, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో తరిమికొట్టడానికే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిందని బండి సంజయ్ వివరించారు. మీకు అండగా బీజేపీ ఉంది, మీ కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ఇవ్వకుండా రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. 
 

Tagged Bandi Sanjay, rajanna siricilla district, Bandi Sanjay Comments, ts bjp, telangana bjp, , Bandi Sanjay Padayatra, tangellapalli mandal, ankireddipalli village, t.bjp

Latest Videos

Subscribe Now

More News