
- ప్రతి నెలా 2 లక్షల టన్నులు సరఫరా చేయండి
- కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి తుమ్మల
- ఏప్రిల్ నుంచి 7.88 లక్షల టన్నులు సప్లై చేసినట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి సెప్టెంబర్‌లో 1.84 లక్షల టన్నుల యూరియా సరఫరా జరిగిందని, ఇది రైతులకు ఎంతో ఊరట కలిగించే అంశమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా మొత్తం 7.88 లక్షల టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. రానున్న యాసంగి సీజన్ కోసం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రతి నెలా 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
మంత్రి తుమ్మల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఆగస్టులో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేయడంతో సెప్టెంబర్‌లో అదనంగా యూరియా పంపింది. ఏప్రిల్‌లో 1.71 లక్షల టన్నులకు గాను 1.21, మేలో 1.61 లక్షల టన్నులకుగాను 0.88 లక్షల టన్నులు, జూన్‌లో 1.70 లక్షల టన్నులకు గాను 0.98, జులైలో 1.60 లక్షల టన్నులకు గాను 1.43, ఆగస్టులో 1.70 లక్షలకు 1.55 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. దిగుమతి టెండర్లలో ఆలస్యం, దిగుమతి టెండర్లలో ఆలస్యం, కారణంగా సరిపడా యూరియా అందించలేకపోయింది’’అని తుమ్మల అన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నం
రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని మంత్రి తుమ్మల అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రులతో సమావేశమై, సంబంధిత శాఖతో సంప్రదింపులు జరపడంతో సెప్టెంబర్‌లో 1.60 లక్షల టన్నుల కేటాయింపుకు బదులు 1.84 లక్షల టన్నులు అందాయని వివరించారు. ‘‘ప్రస్తుతం వరంగల్, మంచిర్యాల, గద్వాల, కరీంనగర్, పందిళ్లపల్లి, జడ్చర్ల, తిమ్మాపూర్ రైల్వే రేక్ పాయింట్లకు సీఐఎల్, ఐపీఎల్ గంగావరం, ఎన్ఎఫ్ఎల్ వైజాగ్, ఐఫ్కో, ఎస్పీఐసీ తదితర కంపెనీల నుంచి 19,538 టన్నుల యూరియా సరఫరా కానున్నది.
ఈ నెలాఖరు వరకు మరో 34,700 టన్నులు చేరే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్‌లో 9.30 లక్షల టన్నుల యూరియా అమ్మకాలతో పోలిస్తే, ఈ ఏడాది 9.50 లక్షల టన్నులు సరఫరా చేశారరు నల్లగొండ, పెద్దపల్లి, కరీంనగర్, వనపర్తి జిల్లాలకు నిరుడు కంటే ఎక్కువ యూరియా అందించాం. యాసంగి సీజన్‌కు 10.40 లక్షల టన్నుల ప్రణాళిక ఉండగా, మొదటి 3 నెలల్లో 6 లక్షల టన్నులు సరఫరా చేయాలని కోరినం’’అని మంత్రి తుమ్మల తెలిపారు.