
- కల్వర్టులు, బ్రిడ్జీలు, నిర్మాణంలో ఉన్న రోడ్లను పరిశీలించాలి: మంత్రి వెంకట్ రెడ్డి
- రోడ్లు డ్యామేజ్ అయితే వెంటనే పునరుద్ధరించండి
- ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. ఎస్ఈలు, ఈఈ, డీఈ, ఏఈఈ లు, ఇతర అధికారులు జిల్లా కేంద్రంలో ఉంటూ కల్వర్టులు, బ్రిడ్జీలు, నిర్మాణంలో ఉన్న రోడ్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరదల వల్ల డ్యామేజ్ అయిన రోడ్ల వివరాలు హైదరాబాద్ లోని ఈఎన్సీ, సీఈలకు పంపాలని, పొంగే వాగులపై ఉన్న బ్రిడ్జిలను తరచూ పరిశీలించాలని సూచించారు.
వరద వల్ల కోతకు గురైన రోడ్లను యుద్ద ప్రాతిపదికన వెంటనే పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీ రాజ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఫీల్డ్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించుకోవాలని తెలిపారు. బలమైన ఈదురు గాలులతో వచ్చే వానల వల్ల రోడ్లను ఆనుకొని ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్, రోడ్ల మీదుగా వెళ్లే హైటెన్షన్ వైర్ల వల్ల కూడా ప్రమాదం ఏర్పడే ఆస్కారం ఉందని, ఎక్కడైనా అట్లాంటివి ఉంటే ముందుగానే గుర్తించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
నదులు, వాగుల వెంట, చెరువు కట్టల కింద ఉన్న రోడ్లు ఊహించని భారీ వరద ప్రవాహానికి దెబ్బతినే అవకాశం ఉంటుందని, ఇరిగేషన్ అధికారులతో టచ్ లో ఉంటూ వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. రోడ్లపై రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని, అదేవిధంగా రోడ్లపై ప్రయాణించే వారిని అప్రమత్తం చేయాలన్నారు. పోలీస్ యంత్రాంగం సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని సూచించారు. వరదలకు రోడ్డు పాడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తిరిగి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. ప్రతి అధికారి ఫీల్డ్ లోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప సెలవుల్లో వెల్లొద్దని మంత్రి ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసరం అయితేనే రోడ్లపైకి రావాలని మంత్రి వెంకట్రెడ్డి కోరారు.