కొత్తల పండుగ..ఆచారాలు మెండుగ !...సంప్రదాయంగా జరుపుకోనున్న ఆదివాసీలు

కొత్తల పండుగ..ఆచారాలు మెండుగ !...సంప్రదాయంగా జరుపుకోనున్న ఆదివాసీలు
  • ఉత్తర కార్తెలో పెద్దలకు కొత్త ధాన్యాలతో నైవేద్యం
  • కొత్త వధువు గొట్టు, గోత్ర నామాల పేర్ల మార్పు
  • సెప్టెంబర్​ 17,18 తేదీల్లో ఆదివాసీ గూడాల్లో పండుగ సందడి

ఏటూరు నాగారం, వెలుగు : ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి ఆదివాసీలది. పండ్లు, ఫలాలు, చెట్లను పూజిస్తారు. తరాలు మారినా అడవితో వీరికి విడదీయలేని బంధం ఉంది.  తమ జీవన శైలిలో భాగంగా ప్రకృతి పూజకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి ఏడాది సెప్టెంబర్​లో ఉత్తర కార్తె మొదలైన తర్వాత వచ్చే తొలి బుధ, గురువారాల్లో  కొత్తల(పెద్దల) పండుగను ఆచార, సంప్రదాయాలతో నిర్వహించుకుంటారు.

 గ్రామ పేరయ్య (పూజారి) ఆదేశాలతో ఆదివాసీలు రెండు రోజుల పాటు ఉదయమే ఇంటిల్లిపాది లేచి ఇండ్లను శుభ్రం చేసుకుని స్నానాలు చేస్తారు. పేరయ్య డప్పు వాయిద్యాలతో ఇంటింటికీ వెళ్లి సల్ల, అంబలి సేకరిస్తారు. వాటిని తీసుకెళ్లి ఊరి బయటికి పొలిమేరలో నలుదిక్కులా పాతిన తోరణ స్తంభాలు ముందు ఆరబోస్తారు. అనంతరం కోళ్లు, మేకలను బలి ఇస్తారు. కుటుంబాలతో వన భోజనాలకు వెళ్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి వేల్పులకు, కొత్త ధాన్యాలు, సారా, కోడి పిల్లలను బలి ఇచ్చి సల్లంగా చూడాలని మొక్కుతారు. ఇయ్యాల, రేపు ఆదివాసీలు సంప్రదాయంగా పండుగను నిర్వహించుకుంటారు. 

కొత్త ధాన్యాలతో పెతర్లకు నైవేద్యం 

 కొత్తల (పెద్దల) పండుగ జరుపుకునే రోజుల్లో చనిపోయిన తమ పూర్వీకులను పితృదేవతలుగా కొలుస్తూ కొత్త ధాన్యాలు, పాలు, చెక్కరతో చేసిన పాయసం నైవేద్యంగా పెడతారు. అనంతరం తల్లి కోడిని ఇంటి ఈశాన్యం  గదిలోకి తీసుకెళ్లి (మొగరానికి) మొక్కి, ఇంటి గుమ్మాల వద్ద ఇప్ప సారా,  పాయసం డొప్పలో ఉంచుతారు. 

సారా ఆరబోసిన తర్వాత మరో కోడిని గుమ్మాలకు అటు, ఇటు కొడుతూ, వడ్డే సెలవు అడుగుతూ కొట్టి చంపుతారు. రెండు కోళ్లను, అన్నం విడివిడిగా వండి, వడ్డే అనుమతి( సెలవు )తో కుటుంబమంతా కలిసి వడ్డిస్తారు. అనంతరం శానార్తి అడిగి అందరూ భుజిస్తారు.  

గొట్టు, గోత్ర నామాల మార్పు

కొత్తల పండుగ రోజు పెద్దలకు పూజలు చేసిన తర్వాత కొత్త వధువు తన పుట్టింటి గొట్టు, గోత్రాలను విడిచి తన భర్త గొట్టు, గోత్రాల్లోకి గ్రామ పేరయ్య మార్పు చేస్తాడు. అనంతరం ఆమెకు తల్లిగారి ఇంటి ఆచార, -సంప్రదా యాలు ఏవీ వర్తించవు. మర్నాడు పెద్దలు పెతర్ల పేరుతో ఇంటి పని వాళ్లకు, ఇతరులకు అన్నదానం, వస్త్రదానం చేసి కొత్తల పండుగ అయిపోయినట్లు భావిస్తారు. ఇక ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మకు నిర్వహించే ప్రతి పూజలో ఇప్ప చెట్టు పూలు, వాటి నుంచి  తయారు చేసిన సారా, చెట్టు ఆకులను ప్రధానంగా వాడుతారు. 

 సెలవు ఇవ్వాలని వినతి 

ఆదివాసీల ఆచార, సంప్రదాయాల నడుమ జరుపుకునే కొత్తల(పెద్దల) పండుగ సందర్భంగా సెలవు ఇవ్వాలని ఆదివాసీ ఉద్యోగులు కోరుతున్నారు. కొత్తల పండుగ నేపథ్యంలో మంగళవారం ఐటీడీఏ ఏవో రాజ్​కుమార్​ను వివిధ శాఖల ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు.