
- రైతుల కష్టాలు తీరుతయ్.. కావాల్సినంత యూరియా ఇస్తాం
- బేస్మెంట్ లెవల్‌కు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు
- ప్రజల అవసరాలను బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలే
- కమీషన్ల కోసమే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారని ఫైర్
- చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో మంత్రి పర్యటన
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: యూరియా సరఫరాపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని రైతులకు సూచించారు. అవసరాలకు తగ్గట్టు యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపారు. త్వరలో జిల్లాకు 2వేల టన్నుల యూరియా వస్తున్నదని చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలను మంత్రి వివేక్ మంగళవారం సందర్శించారు. చెన్నూరు క్యాంపు ఆఫీస్‌లో కోటపల్లి మండల పరిధిలోని గ్రామాలు, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ ఆఫీస్‌లో వార్డుల వారీగా కాంగ్రెస్ శ్రేణుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కేటాయించాల్సిన ఫండ్స్, పనులపై సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు. ‘‘త్వరలో రైతుల యూరియా కష్టాలు తీరుతాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నది. రైతుల అవసరాల మేరకు అందరికీ యూరియా అందజేస్తాం. రబీ సీజన్లో యూరియా దొరకదనే అపోహతో రైతులు పెద్ద మొత్తంలో డంప్ చేసి పెట్టుకున్నారు. అందుకే యూరియా కొరత వచ్చింది. ఈ అపోహలకు కారణం బీఆర్ఎస్ నేతలే’’అని మంత్రి వివేక్ మండిపడ్డారు.
యూరియా కొరతకు కేంద్రం నిర్లక్ష్యమే కారణం
బీఆర్ఎస్ లీడర్ల మాటలు నమ్మొద్దని రైతులకు మంత్రి వివేక్ సూచించారు. ‘‘నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేయించి రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్‌ను రీ ఓపెన్ చేయించిన. నిర్వహణాలోపంతో 90 రోజుల పాటు ప్లాంట్ బ్రేక్ డౌన్ కావడంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. రైతుల అవసరాలకు తగట్టు కేంద్రం యూరియా సప్లై చేయలేదు. కేంద్రం యూరియా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసేది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. నిరుడు కంటే 20 శాతం ఎక్కువగా యూరియా పంపిణీ చేసింది. ఓపిక పడితే అందరికీ కావాల్సినంత యూరియా దొరుకుతదని రైతులకు రిక్వెస్ట్ చేస్తున్న’’అని మంత్రి వివేక్ అన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు బేస్మెంట్ లెవల్ వరకు చేరుకున్నాయని, లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులు కలిగితే స్థానిక లీడర్లు సహకరించాలని సూచించారు.
నత్తనడకన అమృత్‌స్కీమ్ పనులు
చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు కేటాయిస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. ‘‘చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీ ప్రజల తాగునీటి సప్లై కోసం రూ.100 కోట్లతో చేపట్టిన అమృత్ స్కీం పనులు జనవరిలోపు పూర్తి చేస్తాం. రూ.40 కోట్లతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్స్కీం పనులు నత్తనడక సాగుతున్నాయి. పనులను కాంట్రాక్టర్ స్పీడప్ చేయాలి. గద్దెరాగడి కొత్తకాలనీల్లో మౌలిక సదుపాయాల్లేవు. గత బీఆర్ఎస్ హయాంలో రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించకుండానే బిల్డర్లు ప్లాట్లు చేసి అమ్మేశారు. ప్లాట్లు కొన్నవాళ్లు ఇబ్బందులు పడ్తున్నారు. డ్రైయినేజీలు లేకపోవడంతో కాలనీవాసులు విష జ్వరాల బారినపడ్డారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాక కొత్త కాలనీలో రోడ్లు, డ్రైయినేజీలకు అధిక నిధులు కేటాయించాను. ప్రజల అవసరాలు పట్టించుకోకుండా కమీషన్ల కోసమే బీఆర్ఎస్ లీడర్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు’’అని మంత్రి వివేక్ ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు.. ఆర్వోబీ అప్రోచ్ రోడ్డు వేయలేకపోయారని విమర్శించారు. తాను ఎమ్మెల్యే అయ్యాక భూసేకరణ, పరిహారం, ఇతర సమస్యలను పరిష్కరించి ఫ్లైఓవర్ ప్రారంభించానని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ లీడర్ బండి సదానందం యాదవ్ తల్లి లింగమ్మ ప్రమాదవశాత్తు కిందపడగా మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. విషయం తెలుసుకున్న మంత్రి వివేక్.. హాస్పిటల్ వెళ్లి హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు చెన్నూరు, రామకృష్ణాపూర్ పట్టణాల్లో ఇటీవల చనిపోయిన వారి బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. రామకృష్ణాపూర్ జవహర్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త, సీనియర్ క్రికెటర్ బింగి దుర్గాప్రసాద్ 3 రోజుల కిందట గుండెపోటుతో చనిపోగా.. బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు.
చెన్నూరు వార్డుల్లో తిరుగుతూ సమస్యలపై ఆరా
చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్ చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో రూ.30 కోట్లతో అమృత్ పథకం కింద కాలేజ్ గ్రౌండ్, మార్కెట్లో చేపట్టిన వాటర్ట్యాంకర్ల నిర్మాణ పనులు, తహసీల్దార్ ఆఫీస్ వెనుక నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం పనులు, వివిధ వార్డుల్లో రోడ్లు, సైడ్ డ్రైన్ వర్క్స్‌ను మంత్రి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అనంతరం చెన్నూరు మండలం కిష్టంపేట ఎస్సీ కాలనీలో తాగునీటి కోసం నిర్మించిన బోర్వెల్ను మంత్రి ప్రారంభించారు. రామకృష్ణాపూర్, చెన్నూరులో పర్యటించిన మంత్రిని ఐఎన్టీయూసీ సీనియర్ లీడర్ తేజావత్ రాంబాబు నేతృత్వంలో సింగరేణి రిటైర్డు కార్మికులు, అంగన్వాడీ టీచర్లు సన్మానించారు. మంత్రి వెంట క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్ కమిషనర్లు గద్దె రాజు, మురళీకృష్ణ, మందమర్రి తహసీల్దార్ సతీశ్, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.