సింగరేణికి అండగా ఉంటం.. బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సర్కారు అనుమతించింది: మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణికి అండగా ఉంటం..  బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సర్కారు అనుమతించింది: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • సీఎంను ఒప్పించడంలో కీలకంగా వ్యవహరించిన
  • గత బీఆర్​ఎస్​ సర్కార్​ పదేండ్లలో ఒక్క కొత్త గని కూడా తవ్వలేదు
  • వేలంలో పాల్గొనకుండా సంస్థను అడ్డుకున్నది
  • కాంట్రాక్ట్, అవుట్ ​సోర్సింగ్కార్మికుల జీతాల పెంపునకు కృషి చేస్తానని వెల్లడి
  • మందమర్రి, బెల్లంపల్లిలో దసరా వేడుకలకు హాజరు

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. పదేండ్లుగా గనుల తవ్వకం లేకపోవడంతో సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. బీఆర్​ఎస్​ పాలకులు ఒక్క కొత్త బొగ్గు గని కూడా తవ్వలేదన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో జరిగిన దసరా వేడుకల్లో  మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి -సరోజ పాల్గొన్నారు. మందమర్రిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సింగరేణి హైస్కూల్​గ్రౌండ్​లో నిర్వహించిన రామ్‌లీలా వేడుకల్లో మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య, లీడర్లు సలెంద్ర సత్యనారాయణ, అక్బర్​అలీ, మల్లేశ్, సుదర్శనం హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్​ పాలకులు తమకు కావాల్సిన వారికి మేలు చేసేందుకు సింగరేణిని వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. సింగరేణిని బతికించుకోకపోతే భవిష్యత్తు తరాలకు ఏమీ ఇవ్వలేమని.. కొత్త గనులు లేకపోతే సంస్థకు మనుగడ లేకుండాపోతుందని.. ఈ ప్రాంతంలో అభివృద్ది జరగదనే విషయాన్ని తాను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినట్టు చెప్పారు. బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనేందుకు సీఎంను ఒప్పించడంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. ఇక నుంచి వేలంలో సింగరేణి పాల్గొంటూ కొత్త బొగ్గు గనులు దక్కించుకుంటుందన్నారు. ఇటీవల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డిని కలిసి వేలం ప్రక్రియ తొందరగా చేపట్టాలని కోరినట్టు చెప్పారు. 

మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్​ను సింగరేణి దక్కించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో  కనీస వేతనాలు ఇవ్వలేదన్నారు. సింగరేణి కాంట్రాక్ట్​, అవుట్​సోర్సింగ్​ కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం కార్మికశాఖ మంత్రిగా తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక

దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, తెలంగాణలో అతిపెద్ద పండుగ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ  సందర్భంగా ఆయన చెన్నూరు నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే  విజయం సాధించవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోందని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలు, అన్ని గ్రామాల్లో రూ.500 కోట్లతో  అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.

అహింసే  ఆయుధంగా ఆంగ్లేయులతో పోరాడి దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్మాగాంధీ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని తన  క్యాంపు ఆఫీస్​లో వెహికల్స్, ఆయుధాలకు పూజ చేశారు. అనంతరం టౌన్‌లోని వార్డుల్లో, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమ్మ గార్డెన్​ ఏరియాలోని దుర్గామాత మండపాల్లో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. 

గాంధీ జయంతిని పురస్కరించుకొని చెన్నూరులో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బెల్లంపల్లి, మందమర్రిలో జరిగిన రామ్‌లీలా కార్యక్రమంలో మంత్రి వివేక్ ఆయన సతీమణి సరోజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మందమర్రిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా రామ్‌లీలా వేదికైన సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​కు మంత్రి వివేక్​ వెంకటస్వామి- దంపతులు తీసుకొచ్చారు. 

సింగరేణిని కాపాడిన కాకా వెంకటస్వామి..

కాకా కుటుంబం ఎల్లప్పుడు సింగరేణి కార్మికులకు అండగా ఉంటూ సేవ చేస్తున్నదని మంత్రి వివేక్ అన్నారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను రక్షించడంతో పాటు లక్ష ఉద్యోగాలను కాపాడరన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని భరోసా ఇచ్చారు. సింగరేణి కార్మికులు, రిటైర్డు కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొట్లాడుతున్నారని చెప్పారు. 

కేంద్రంపై ఒత్తిడి తీసుకవచ్చి రిటైర్డు కార్మికుల పెన్షన్​ కోసం రూ.140 కోట్లు  ఇప్పించారన్నారు. సింగరేణి సంస్థను రక్షించుకుంటూ, కార్మికులను కాపాడుకోవడానికి కాకా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని.. తమ కుటుంబంపై సింగరేణి కార్మికుల ప్రేమ కూడా ఎప్పుడూ ఉండాలన్నారు.