న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ రూల్స్ అతిక్రమించిందనే ఆరోపణలతో హీరో మోటో కార్ప్పై దర్యాప్తునకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫెయిర్స్ (ఎంసీఏ) ఆదేశించింది. ఈ కంపెనీకి సంబంధమున్న మరో ఎంటిటీలో నిజమైన బెనిఫిషియరీలు ఎవరనే దానిపై ప్రశ్నలు తలెత్తినట్లు తెలుస్తోంది. హీరో మోటోకార్ప్‌తో సంబంధమున్న ఆ లింక్డ్ ఎంటిటీల (సంస్థలు) ఓనర్లు ఎవరనేది ఈ దర్యాప్తులో తేల్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పై నేపథ్యంలో, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నాయి. ఆ ఎంటిటీలలో హీరో మోటోకార్ప్ ప్రమోటర్లకు ఏవైనా ప్రయోజనం ఉందా లేదా అనేది తెలుసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
హీరో మోటోకార్ప్‌తో దగ్గర సంబంధాలున్న మరో సంస్థ సాల్ట్ ఎక్స్పీరియెన్స్అండ్ మేనేజ్‌మెంట్‌పైనా ఈ దర్యాప్తు సాగనుంది. సాల్ట్ ఎక్స్పీరియెన్స్అండ్ మేనేజ్మెంట్ సంస్థతో హీరో మోటో కార్ప్ప్రమోటర్లకు దగ్గర సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరో మోటో కార్ప్ షెల్ కంపెనీలను ఏర్పాటు చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) కూడా దానిపై ఎంక్వయిరీ జరిపి, సమగ్రమైన దర్యాప్తు అవసరమని తేల్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తుకు సంబంధించిన సమాచారమేదీ తమకు అందలేదని మరోవైపు హీరో మోటోకార్ప్ స్పోక్స్‌పర్సన్ చెబుతున్నారు. ఏ రెగ్యులేటరీ అథారిటీ అడిగే ప్రశ్నలకైనా సమాధానాలు, సమాచారం అందిస్తామని వెల్లడించారు.
