వ్యాపారి వద్ద 30 వేలు లంచం తీసుకుంటుంటే..

వ్యాపారి వద్ద 30 వేలు లంచం తీసుకుంటుంటే..
  • వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

హైదరాబాద్: బ్రాండెడ్ ఉత్పత్తుల కేసు విషయంలో  వ్యాపారి నుంచి 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎస్.ఐ బేరమాడడంతో 30వేలకు ఒప్పుకున్నాడు...  రహస్యంగా లంచం డబ్బు తీసుకుని ఏమీ తెలియనట్లు తన సీట్లోకి వెళ్లి కూర్చుంటుంటే.. ఏసీబీ అధికారులు హఠాత్తుగా షాకిచ్చారు. హ్యాండ్సప్ అంటూ చుట్టుముట్టి ఆయన జేబులో.. టేబుల్ డ్రాలో సోదాలు చేయగా.. రూ.20 నగదు దొరికింది. ఆ డబ్బును సీజ్ చేసి అక్కడికక్కడే కెమికల్ టెస్ట్ చేయగా.. వ్యాపారి దగ్గర నుంచి తీసుకున్న లంచం డబ్బేనని నిర్ధారణ అయింది. దీంతో ఏసీబీ అధికారులు సదరు ఎస్ఐను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ లో చోటు చేసుకుంది.  
అరెస్టు చేసే స్థాయి నుంచి.. తానే అరెస్టయిన ఎస్.ఐ యాదగిరి
మియాపూర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ పేరు యాదగిరి. తన పోలీసు స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు.. ఎవరైనా అసాంఘిక, అక్రమాలకు లేదా నేరాలకు పాల్పడేవారిపై నిఘా పెట్టి ఆధారాలు దొరకబుచ్చుకుని అరెస్టు చేసే స్థాయి నుంచి తానే నేరం చేసి అరెస్టయి కటకటాలపాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్వయంగా పోలీసు శాఖకు చెందిన ఎస్.ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడిన ఘటన కలకలం రేపింది. 
ఇంతకూ ఏం జరిగిందంటే..
మియాపూర్ గార్మెంట్స్ షాపు యజమాని షేక్ సలీం. ఫుమా లోగో వేసుకొని దుస్తులు విక్రయిస్తున్న కేసులో మియపూర్ పోలీస్ స్టేషన్లో ఆ సంస్థ వారు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్ చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని ఎస్.ఐ డబ్బు డిమాండ్ చేశారు. తొలుత 50 వేలు డిమాండ్ చేసిన ఎస్.ఐ యాదగిరి చివరకు రూ.30 వేలు తీసుకునేందుకు ఒప్పుకుని రూ.10వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. మిగిలిన రూ.20 వేల కోసం ఎదురు చూస్తుంటే.. ఈరోజు షాపు యజమాని ఫోన్ చేసి వస్తున్నాననంటే... సరేనన్నాడు. స్టేషన్ ప్రాంగణంలో ఎవరూ చూడకుండా రహస్యంగా లంచం డబ్బు రూ.20 వేలు తీసుకుని తన సీట్లో కూర్చున్న కాసేపట్లోనే ఏసీబీ వారు ఎంటర్ కావడంతో సీన్ రివర్స్ అయింది. ఎవరినైనా అరెస్టు చేసే స్థాయిలో ఉదయమే స్టేషన్ లో డ్యూటీకీ హాజరైన ఆయన... చివరకు తానే అరెస్టయి.. కటకటాలపాలైన ఉదంతం చర్చనీయాంశం అయింది.