
- మైక్రో ఫైనాన్స్ కు, నాకు ఎలాంటి సంబంధం లేదు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులను మోసం చేసిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆదివాసీ ఎమ్మెల్యేను కాబట్టే తనపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెన్ గంగా భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ పేదవాడు ఎమ్మెల్యే కావడం జీర్ణించుకోలేక తనను టార్గెట్ చేసుకొని యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు కథనాలు ప్రచురించారని అన్నారు.
తాను వెడ్మ బొజ్జు ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, తన ఆఫీసు భవనంలోనే సదరు మైక్రో ఫైనాన్స్ సంస్థ ఆఫీస్ కూడా ఉందని.. అంతమాత్రానే నిరుద్యోగులను మోసం చేసిన ఫైనాన్స్ నిర్వాహకులకు, తనకు సంబంధం ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ సంస్థ విషయాలు తనకేమీ తెలియదని స్పష్టం చేశారు. కానీ కొంత మంది బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై బుదర జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను దెబ్బకొట్టేం దుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్యపు ఆరోపణలు చేస్తే సహించం
జన్నారం, వెలుగు: ఎమ్మెల్యే బొజ్జుపటేల్పై అసత్యపు ఆరోణలు చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదివాసీ గిరిజన సంఘం జన్నారం మండల ప్రెసిడెంట్ సిడాం కాళీ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉట్నూర్ కేంద్రంగా నడిచిన మైక్రో పైనాన్స్తో ఎమ్మెల్యే కు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. బూటకపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్న ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోనేరావు, తుడుందెబ్బ నాయకులు మర్సుకోల వసంత్, గంగు పటేల్, ధర్ము పటేల్, హన్యంతరావు తదితరులు పాల్గొన్నారు.