పేదల చెంతకు సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్

పేదల చెంతకు సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్

కురవి, వెలుగు: సంక్షేమ పథకాలను పేదల చెంతకు చేరుస్తున్నామని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. గురువారం కురవి మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్​లో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కురవి మండలానికి 3,925 కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో​ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖాలాలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్న బీఆర్ఎస్​నేతలు నేడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ సర్కార్ పై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

 అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ లో చేరిన రెడ్యానాయక్ బియ్యం, బెల్లం, ఇసుక వ్యాపారాలు చేసి ఆయన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. అనంతరం రైతు వేదికలో మొక్కలు నాటారు. డీఎస్ వో రాజేంద్రం, తహసీల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

నెల్లికుదురు, వెలుగు: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని  ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. గురువారం నెల్లికుదురు, ఇనుగుర్తి మండల కేంద్రంలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోగా పుట్టిన పిల్లలను కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.