తెలంగాణపై మోదీ మాటలను సోనియా, రాహుల్ ఖండించలేదు: కవిత

తెలంగాణపై మోదీ మాటలను సోనియా, రాహుల్ ఖండించలేదు: కవిత

సీఎం కేసిఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మెనీఫెస్టోతో కాంగ్రెస్, బిజెపి పార్టీల మైండ్ బ్లాంక్ అయ్యిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 2023, అక్టోబర్ 18 వ తేదీ బుధవారం బోధన్ లో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని,  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మాకు చెప్పనక్కర్లేదని అన్నారు. బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్  ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. వేలమంది బీసీ యువకులు విదేశాలకు వెళ్లీ చదువుకునే అవకాశం కల్పించామని ఆమె తెలిపారు. రైతు బందు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు.  రైతులపై రాజకీయం చేయడం కాంగ్రెస్ నైజమని ఆమె మండిపడ్డారు.  

Also Read :- జడ్చర్ల, మేడ్చల్‌కు సీఎం కేసీఆర్‌

నిజాం షుగర్ పరిశ్రమ ప్రైవేటీకరణ చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు ఏం చేశారని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర విడిపోయిన తర్వాత మనకు రావాల్సిన విభజన హామీలపై ఏ రోజైనా రాహుల్ గాంధీ పార్లమెంటులో బిజెపి ప్రభుత్వాన్ని అడిగారా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పార్లమెంటులో ప్రధాని మోడీ.. తెలంగాణపై అనేక మాటలు అంటుంటే.. తల్లికొడుకులు సోనియా, రాహుల్ గాంధీలు అక్కడే కూర్చొని ఉన్నారు గానీ... కనీసం అభ్యంతరం చెప్పాలేదన్నారు.   ఇక్కడ అన్ని వర్గాలు కలిసి శాంతి, సామరస్యంతో జీవిస్తున్నారు.  బీఆఎర్ఎస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ కు వందల కంపెనీలు వచ్చాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంత అభివృద్ధి జరిగిందా అని కవిత ప్రశ్నించారు.