నెక్స్ట్​ పీఎం క్యాండిడేట్ సర్వేలో.. మోడీనే నంబర్ వన్

నెక్స్ట్​ పీఎం క్యాండిడేట్ సర్వేలో.. మోడీనే నంబర్ వన్
  • 12 రాష్ట్రాల్లో 20 వేల మందిపై ‘ప్రశ్నమ్’ సంస్థ సర్వే 
  • 32.8% మంది మోడీకే జై ఆల్టర్నేటివ్​గా రాహుల్​కు 17.2% ఓట్లు
  • కాంగ్రెస్, బీజేపీయేతర లీడర్లకు లేని ఆదరణ ..  సీఎం కేసీఆర్​కు 0.7 శాతమే  

  
న్యూఢిల్లీ:  దేశానికి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్​గా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు? అంటూ ‘ప్రశ్నమ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీకే జనం మళ్లీ జై కొట్టారు. దేశవ్యాప్తంగా12 రాష్ట్రాల్లో 20 వేల మంది ఓటర్లపై సర్వే నిర్వహించగా, మోడీ అందరికంటే పాపులర్ లీడర్ గా టాప్​లో  నిలిచారు. ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్​తో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ భేటీలు, కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల నేతలతోనూ చర్చల నేపథ్యంలో మళ్లీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కాబోతోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్​గా ఎవరైతే బాగుంటుందంటూ ప్రశ్నమ్ సర్వే నిర్వహించింది. ఇందులో మోడీకి దరిదాపుల్లో ఏ లీడర్​కూ స్థానం దక్కలేదు. మోడీకి 32.8% మంది జైకొట్టగా.. ఆయనకు ఆల్టర్నేటివ్​గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 17.2% మంది ఓకే చెప్పారు. ఇతర ప్రాంతీయ పార్టీల లీడర్లెవరిపైనా పెద్దగా జనం మొగ్గు చూపలేదు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు థర్డ్ ఫ్రంట్​గా ఏర్పడినా మోడీకి దీటైన లీడరే లేరని ఈ సర్వేలో తేలింది. 
ఎవరెవరికి ఎంత శాతం? 
మోడీ, రాహుల్ తర్వాత ప్రధాని క్యాండిడేట్ గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7% మంది సర్వేలో ఓటేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు 6.1% మంది ఓకే చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్​కు 3%, అఖిలేశ్​ యాదవ్​కు 2.2% ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు 2.1%, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్​కు 1.5%, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్​కు 1.4% మంది మొగ్గుచూపారు. శరద్ పవార్, కేంద్ర మంత్రి అమిత్ షాకు 0.9%, కర్నాటక సీఎం యెడియూరప్పకు 0.8%, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​కు 0.5% ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ గా సీఎం కేసీఆర్​కు 0.7% మంది మాత్రమే మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైంది.