
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు వస్తున్నందునే రైతులపై సీఎం కేసీఆర్ కపటప్రేమ కురిపిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. భద్రాచలం రాముడికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు ఇవ్వని సీఎం కేసీఆర్ మాత్రమే అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం రూ.200 కోట్లు ఇచ్చిందన్నారు. రైతులకు కేసీఆర్ఇస్తానన్న ఉచిత ఎరువులు ఏమయ్యాయని నిలదీశారు. పేపర్ల లీకేజీతో నిరుద్యోగ కుటుంబాలు ఆందోళన చెందుతుంటే కేసీఆర్ మాత్రం రాష్ట్రాలు తిరుగుతున్నాడు తప్ప బాధితులకు భరోసా ఇవ్వట్లేదని మండిపడ్డారు. కాగా, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి అన్నారు.