- పుట్టినింట జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో నెల రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా, కోట్లాది మంది జనం వనదేవతల దర్శనానికి బారులు తీరనున్నారు. మేడారంతో పాటు సమ్మక్క పుట్టిన గ్రామంగా ప్రచారంలో ఉన్న హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ కూడా మహాజాతరకు సిద్ధమవుతున్నది.
తల్లి జన్మస్థలంగా ఈ గ్రామం ప్రాచుర్యం పొందగా, తల్లుల దర్శనానికి ఇక్కడికీ లక్షలాది మంది జనం తరలివస్తుంటారు. దీంతో అగ్రంపహాడ్ మినీ మేడారంగా పేరుగాంచగా, జనవరి 28 నుంచి నిర్వహించనున్న మహాజాతర కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సమ్మక్క పుట్టిన ఊరుగా ప్రసిద్ధి..
సమ్మక్క తల్లి ఎక్కడ పుట్టిందనే విషయంపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఒక్కోచోట ఒక్కో కథ ప్రచారంలో ఉంది. సమ్మక్క ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేటలో పుట్టిందని కొందరు అంటుంటే.. మేడరాజు పాలించిన జగిత్యాల జిల్లా పొలవాసలో జన్మించిందని ఇంకొందరు చెబుతున్నారు. మరోవైపు ఛత్తీస్ గడ్ ప్రాంతంలోనే సమ్మక్క తల్లి పుట్టిందనే కథ కూడా ఉంది.
వీటితో పాటు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ లోనే సమ్మక్క పుట్టిందని కథ కూడా ప్రచారంలో ఉండగా, చారిత్రక ఆధారాలు ఏమీ లేకపోవడంతో చరిత్ర పరిశోధకులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ, అగ్రంపహాడ్ లోనే పుట్టిందని స్థానిక ప్రజలు విశ్వసిస్తుండగా, రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర తరహాలోనే ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
20 లక్షలకుపైగా భక్తులు రాక..
ప్రతి రెండేండ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుండగా, అదే సమయంలో అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహిస్తుంటారు. ఈ మేరకు జనవరి 28 నుంచి 31 జాతర కొనసాగనుంది. మేడారానికి ప్రతిసారి కోట్లాది జనం తరలివెళ్తుండగా, సమ్మక్క పుట్టింది ఇక్కడేననే విశ్వాసంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అగ్రంపహాడ్ కు కూడా వస్తుంటారు.
ప్రతిసారి జాతర సమయంలో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య 20 లక్షలకుపైగానే ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లపై ఫోకస్..
పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో ఆఫీసర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత జాతర సమయంలో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవగా, వాటిని అధిగమించేందుకు ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. గత జాతర సమయంలో పని చేసిన వారితో పాటు అనుభవం ఉన్న 30 మంది ఆఫీసర్లతో టీమ్ ఏర్పాటు చేస్తున్నారు.
జాతరలో శానిటేషన్ ప్రధాన సమస్య కాగా, జీడబ్ల్యూఎంసీతో పాటు చుట్టుపక్కల జీపీలకు చెందిన దాదాపు 200 మందితో పారిశుధ్య పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాతర ఆవరణలో 17 చోట్ల నల్లాలు పెట్టనున్నారు. జనం ఉండే చోట్లా ట్యాంకర్లతో నీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భక్తులకు రవాణా సదుపాయం కల్పించేందుకు హనుమకొండ నుంచి ప్రతి 15 నిమిషాలకో బస్సు నడిపించేలా చర్యలు చేపడుతున్నారు.
వీఐపీ దర్శనాలతో ఇబ్బందులు తలెత్తకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో స్పెషల్ దర్శనానికి రూ.200, రూ.100 టికెట్లతో ప్రత్యేక దర్శనాలు కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. జాతర ఆవరణలో 100 టెంపరరీ టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా సుమారు 600 మందితో బందోబస్తు, 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. వెహికల్స్ పార్కింగ్ కోసం ఆరు చోట్ల ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు
ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తం..
అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ చర్యలు పెడతాం. ముఖ్యంగా లైటింగ్, పార్కింగ్, టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్యూ లైన్లు, ఇతర సమస్యలు తలెత్తకుండా యాక్షన్ తీసుకుంటాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ శాఖల ఆఫీసర్ల సమన్వయంతో జాతరను సక్సెస్ చేస్తాం.- అద్దంకి నాగేశ్వరరావు, ఈవో, అగ్రంపహాడ్
