- డాలర్‌తో పోల్చితే ఓపెన్ మార్కెట్లో ఇరాన్ కరెన్సీ 14.2 లక్షల రియాల్స్కు పతనం
- అమాంతం పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు
- షాపులు మూసేసి నిరసన బాట పట్టిన వ్యాపారులు
టెహ్రాన్: ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. సోమవారానికి ఇరానీ రియాల్ విలువ డాలర్‌తో పోల్చితే భారీగా పతనమైంది. ఓపెన్ మార్కెట్లో ఒక అమెరికన్ డాలర్‌తో పోల్చితే ఇరాన్ కరెన్సీ 14.2 లక్షల రియాల్స్‌కు పడిపోయి 2025లో కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. దాంతో ఇరాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ఇప్పటికే అణు ఆంక్షల ఎఫెక్ట్ ఆ దేశంపై తీవ్రంగా పడగా.. ఇప్పుడు ఇంధన సంక్షోభం, నీటి కొరత, గాలి కాలుష్యం, ఇంటర్నెట్ నియంత్రణతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అంతర్జాతీయ ఆంక్షలు, నూక్లియర్ ఒత్తిళ్లు, ఇజ్రాయెల్‌తో జూన్‌లో జరిగిన ఘర్షణ పరిణామాలు ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నది.
వెల్లువెత్తుతున్న నిరసనలు
ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్‌లో ఆహార పదార్థాల ధరలు 72%, ఆరోగ్య సంబంధిత వస్తువుల రేట్లు 50% పెరిగాయి. ఇంధన ధరల పెంపు, పన్నుల పెంపు ప్రతిపాదనలు ప్రజలపై మరింత భారాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో టెహ్రాన్, హమదాన్, ఇస్ఫహాన్, షిరాజ్ వంటి నగరాల్లో వ్యాపారులు, దుకాణదారులు తమ షాపులను మూసివేసి నిరసనలకు దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ర్యాలీలు చేశారు. వీరికి తోడుగా కార్మికులు, నర్సులు, గని కార్మికులు కూడా సమ్మెలు, ధర్నాలు చేపట్టారు. ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
