బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం : కేసీఆర్

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం : కేసీఆర్
  •     అసెంబ్లీలో హరీశ్, తలసాని, సబిత 
  •     మండలిలో రమణ, శ్రీనివాస్​ను నియమించిన కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సూచనలు కనిపించడం లేదు. సోమవారం అసెంబ్లీ సెషన్​కు హాజరైన ఆయన.. సంతకం చేసి మూడు నిమిషాలు మాత్రమే సభలో ఉండి బయటకు వెళ్లిపోయారు. అయితే, అసెంబ్లీకి మంగళవారం తాజాగా డిప్యూటీ ఫ్లోర్​ లీడర్లను కేసీఆర్​ నియమించారు. 

అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్లుగా హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను నియమించారు. మండలిలో పార్టీ ఉప నేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించగా.. మండలి పార్టీ విప్​గా దేశపతి శ్రీనివాస్​ను నియమించారు. డిప్యూటీ ఫ్లోర్​ లీడర్ల నియామకంతో కేసీఆర్​ ఈ సభ సమావేశాల్లో కృష్ణా నీళ్ల అంశంపై చర్చకు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తున్నది. కాగా, తొలిరోజు అసెంబ్లీ సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన కేసీఆర్​.. హైదరాబాద్​ నందినగర్​లోని నివాసంలోనే ఉంటున్నారు. 

దీంతో అక్కడికి బీఆర్ఎస్​ కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్​ను కలిసేందుకు మంగళవారం పోటెత్తారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో భద్రతా సిబ్బంది వారిని లైన్​లో ఉంచి కేసీఆర్​ వద్దకు పంపించారు. మంగళవారమే ఫాంహౌస్​కు వెళ్లాల్సి ఉన్నా.. వచ్చిన కార్యకర్తలను కలిసేందుకు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.