రాఖీ పండుగ రోజు విషాదం.. యాక్సిడెంట్లలో నలుగురు మృతి

 రాఖీ పండుగ రోజు విషాదం.. యాక్సిడెంట్లలో నలుగురు మృతి
  • అన్నకు రాఖీ కట్టి వస్తుండగా మహిళ..  

తాడ్వాయి, వెలుగు : అన్నకు రాఖీ కట్టి వస్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.  తాడ్వాయి  మండలం కోడిశెల గ్రామానికి చెందిన మొగిలిపల్లి పద్మ(45) భర్త కృష్ణతో కలిసి శనివారం ఉదయం అన్నకు రాఖీ కట్టేందుకు బైక్ పై అంకంపల్లికి వెళ్లారు. తిరిగొస్తుండగా నాంపల్లి నీళ్ల ఒర్రె సమీపంలో బైక్ అదుపుతప్పి దంపతులు కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన పద్మ స్పాట్ లో చనిపోగా.. కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలియడంతో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి వెళ్లి పంచనామా చేసి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఏటూరు నాగారం ఆస్పత్రికి  తరలించారు. పద్మ మృతితో  కోడిశాలలో విషాదం నెలకొంది. 

 తల్లితో కలిసి మేనమామ ఇంటికి వెళ్లిన యువతి 

సిద్దిపేట రూరల్: రాఖీ కట్టేందుకు తల్లితో కలిసి మేనమామ ఇంటికి వెళ్లిన  యువతి యాక్సిడెంట్ లో చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన ప్రకారం.. చిన్నకోడూరు మండలం గోనపల్లికి చెందిన తాళ్లపల్లి పర్శరాములు, పల్లవి దంపతుల కూతురు శ్రుతి(23)తో కలిసి గజ్వేల్ లో ఉంటున్నారు. సోదరుడికి రాఖీ కట్టేందుకు పల్లవి తన కూతురితో కలిసి గోనెపెల్లికి  వెళ్లారు. అనంతరం నంగునూరు మండలం అంక్షాపూర్ లో బంధువులకు రాఖీ కట్టేందుకు శ్రీనివాస్ తో కలిసి కారులో తల్లీకూతుళ్లు వెళ్తున్నారు. 

సిద్దిపేట టౌన్ కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీల వద్ద కారు టైరు పేలిన శబ్దం రావడంతో శ్రీనివాస్ పక్కకు ఆపేందుకు యత్నిస్తుండగా.. వెనక నుంచి ఆర్టీసీ బస్సు స్పీడ్ గా వచ్చి ఢీకొట్టింది. దీంతో  శ్రుతి, శ్రీనివాస్  తీవ్రంగా గాయపడ్డారు.  పల్లవికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108లో  సిద్దిపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ  శ్రుతి చనిపోయింది. మృతురాలి తండ్రి పర్శరాములు ఫిర్యాదుతో బస్సుడ్రైవర్ రెడ్డి లక్ష్మణ్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సొంతూరు వెళ్తుండగా స్టాఫ్ నర్స్..

వరంగల్​ సిటీ : రాఖీ పండుగకు ఇంటికి వెళ్తుండగా స్టాఫ్ నర్స్ మృతిచెందిన ఘటన వరంగల్​ సిటీలో జరిగింది. ఏనుమాముల ఇన్ స్పెక్టర్ సురేశ్​ తెలిపిన ప్రకారం.. ములుగు జిల్లా మంచినీళ్ల పల్లెకు  చెందిన రాయనబోయిన శ్యామల(23) వరంగల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్​నర్స్ చేస్తూ హాస్టల్లో ఉంటుంది. రాఖీ పండుగకు  తన తమ్ముడు శ్రీనివాస్​ బైక్ పై శుక్రవారం రాత్రి సొంతూరు వెళ్తుండగా.. ఆరేపల్లి సమీపంలోని కెనాల్​వద్ద బైక్​ అదుపుతప్పి డివైడర్​ ను ఢీకొంది. దీంతో  శ్యామల కిందపడడంతో తలకు తీవ్ర గాయమై స్పాట్ లో చనిపోయింది. మృతురాలి తండ్రి రమేశ్​ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు 
తెలిపారు.

అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి వెళ్తుండగా యువకుడు..  

నవీపేట్ : అక్క ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకొని తిరిగి వెళ్తూ యువకుడు చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నవీపేట్ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపిన మేరకు.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయిబాబు(19), రాఖీ పండుగ సందర్భంగా నిజామాబాద్ లో ఉండే తన అక్క వద్దకు ఫ్రెండ్ అరవింద్ తో కలిసి స్కూటీపై వెళ్లాడు. రాఖీ కట్టించుకుని తిరిగి  వెళ్తుండగా.. జగ్గారావు ఫామ్ ముందు కంటెయినర్ లారీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో సాయిబాబు తలకు తీవ్ర గాయాలై స్పాట్ లో చనిపోగా.. అరవింద్ కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.  సాయిబాబు మృతితో పండుగపూట కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది .