
ములుగు, వెలుగు: మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అనుకోని ఘటనలు జరిగితే వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు మండలం అన్నంపల్లికి చెందిన మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు పోరిక రమేశ్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభకు మంత్రి, ఎంపీ పోరిక బలరాం నాయక్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనుకోని ఘటనలు జరిగినప్పుడు కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమన్నారు.
కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ రమేశ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సంక్షేమ నిధి (ఎఫ్‌డబ్ల్యూఎఫ్) పథకం ద్వారా యూటీఎఫ్ సహకారంతో రూ.6 లక్షల చెక్కును మంత్రి రమేశ్కుటుంబ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధానకార్యదర్శి ఆదిమూలం వెంకట్, వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్య నాయుడు, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మణ్ రేగ కల్యాణి, పోరిక గోవింద్‌నాయక్, ఎఫ్ డబ్ల్యూఎఫ్ రాష్ట్ర చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, ఎంఎస్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ములుగులోని ఏరియా ఆస్పత్రి నుంచి తోగుంట బతుకమ్మ ఆడే ప్రాంతం వరకు రూ.4 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను మంత్రి ప్రారంభించారు.