
- ఒక్కొక్కటిగా బయటపడుతున్న మై హోమ్ అక్రమాలు
- ఏటా కట్టాల్సిన ట్యాక్స్ రూ.2.80 కోట్లు.. కట్టేది రూ.25 లక్షలు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మైహోమ్ కంపెనీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గ్రామ పంచాయతీకి ప్రతి ఏటా కోట్లలో ట్యాక్స్ కట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం లక్షల్లో మాత్రమే చెల్లిస్తూ చేతులు దులుపుకుంటోంది. దీనిని గుర్తించిన ఆఫీసర్లు కంపెనీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
రూ. 2.80 కోట్లకు రూ. 25 లక్షలే చెల్లింపు
గ్రామాల్లో ఉన్న కమర్షియల్ బిల్డింగ్‌లు, కంపెనీలకు కట్టడాల విస్తీర్ణం, వాటి విలువ ఆధారంగా 0.25 పైసల నుంచి ఒక రూపాయి వరకు పన్ను వసూలు చేసే అధికారం గ్రామపంచాయతీకి ఉంది. అలాగే ప్రతి ఐదేళ్లకు ఓసారి బిల్డింగ్ కొలతలు, రికార్డుల రివిజన్ చేపడుతూ గతంలో కట్టిన ట్యాక్స్ మీద 20 శాతం మేర పెంచుకుంటూ వసూలు చేస్తారు. కానీ మేళ్లచెరువు గ్రామ పంచాయతీ ఆఫీసర్లు మాత్రం మైహోమ్ కంపెనీని ఈ రూల్స్ నుంచి మినహాయించారు. మైహోమ్ ఫ్యాక్టరీ మొత్తం 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ఇందుకు సంబంధించి గ్రామ పంచాయతీకి ప్రతి ఏటా రూ. 2.80 కోట్లు కట్టాల్సి ఉంది. కానీ కంపెనీ యాజమాన్యం కేవలం 18 ఎకరాలకే రూ. 25 లక్షలు చెల్లిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీ ఆదాయానికి భారీ మొత్తంలో గండి పడుతోంది. దీనికి తోడు 20 ఏళ్ల క్రితం నిర్ధారించిన కొలతల ప్రకారమే ఇప్పటికీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 2023- – 24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.80 కోట్లు కట్టాలని డిమాండ్ నోటీసు ఇచ్చినా కంపెనీ ఓనర్లు పట్టించుకోలేదు.
కలెక్టర్ ఫోకస్
జిల్లాలోనే పెద్ద గ్రామ పంచాయతీ అయిన మేళ్లచెరువు పన్నుల చెల్లింపుల్లో చివరి స్థానంలో ఉండడంతో కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి వివరాలు సేకరించడంతో మైహోం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇటీవల మైహోమ్ సంస్థ ప్రతినిధులను కలెక్టరేట్‌కు పిలిపించి పూర్తి స్థాయిలో ట్యాక్స్ చెల్లించాలని, 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కట్టడాల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మై హోం పరిశ్రమకు సంబంధించిన ట్యాక్స్‌ను రివిజన్ చేయాలని జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది.