
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో గాయపడ్డ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి దూరమయ్యాడు. క్రిస్ వోక్స్ బాల్ తగిలి అతని కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. అయినప్పటికీ జట్టు కోసం మొక్కవోని సంకల్పంతో తను బ్యాటింగ్‌కు వచ్చాడు. అతని ప్లేస్‌లో సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తున్నాడు.
అయితే పంత్ గాయం తీవ్రత దృష్ట్యా తను పూర్తిగా కోలుకునేందుకు ఆరు వారాల సమయం పట్టనుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఐదో టెస్టుకు తను పూర్తిగా దూరంగా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ ప్లేస్‌లో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఎన్. జగదీశన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పంత్‌కు రీప్లేస్‌మెంట్‌గా మరో కీపర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని అనుకున్నా.. మడమ గాయం కారణంగా అతను అన్‌ఫిట్‌గా ఉన్నట్టు తేలింది. దీంతో సెలెక్టర్లు జగదీశన్ వైపు మొగ్గినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అతడిని ఇంగ్లండ్ రప్పించేందుకు వీసా పక్రియ కూడా షురూ చేసినట్టు తెలుస్తోంది. ‘జగదీశన్ 10 రోజుల నుంచి కోయంబత్తూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐదో టెస్టుకు సెలెక్ట్ చేసినట్టు గురువారం మధ్యాహ్నం తనకు బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చింది. అతని జెర్సీ నంబర్‌తో పాటు అవసరమైన సమాచారాన్ని బోర్డు సేకరించింది. రెండు రోజుల్లో వీసా క్లియర్ అవ్వొచ్చు. నాలుగో టెస్టు ముగిసే సమయానికి తను ఇంగ్లండ్ వెళ్లి జట్టుతో చేరుతాడు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి.